కామారెడ్డి, డిసెంబరు 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
టీయూడబ్ల్యూజే (ఐజేయు) కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాదులో సినీ నటుడు మోహన్‌బాబు మీడియా ప్రతినిధులపై చేసిన దాడికి నిరసనగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ధర్నాచౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ మాట్లాడుతూ మోహన్ బాబు ఇంటి ముందు ఆయన కుమారుడు మంచు మనోజ్‌తో గొడవ జరుగుతుందన్న సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు కవరేజ్‌కి వెళ్లారనీ చెప్పారు. అక్రోషానికి గురైన మోహన్‌బాబు మీడియా ప్రతినిధులపై విచక్షణ రహితంగా దాడి చేశారన్నారు. దాంతో రంజిత్ అనే టీవీ9 జర్నలిస్టుకు తీవ్ర గాయాలు అయ్యాయన్నారు. రంజిత్ తో పాటు మరో ఇద్దరికి గాయాలు కావడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనీ చెప్పారు.
దాడులను తీవ్రంగా ఖండిరచారు. దాడికి పాల్పడ్డ మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చికిత్స పొందుతున్న జర్నలిస్టులకు ప్రభుత్వమే వైద్య సదుపాయం కల్పించాలని కోరారు. జర్నలిస్టులపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టియుడబ్ల్యూజే ఐజేయు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పట్నంశెట్టి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆబిద్, ఆర్గనైజేషన్ సెక్రటరీ రజాక్, శ్రీకాంత్, రామేశ్వర్ ముధాం శంకర్, శివ, చక్రధర్ యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.