నిజామాబాద్, డిసెంబరు 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (టియుసిఐ) ఆధ్వర్యంలో డిచ్‌పల్లి ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, ఎంపీడీవోకి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా టియుసిఐ జిల్లా ప్రధానకార్యదర్శి ఎం. సుధాకర్, జిల్లా నాయకులు బి. మురళి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలోని 12,741 గ్రామ పంచాయతీలలో సుమారు 50 వేల పైగా మల్టీపర్పస్ వర్కర్స్ గా విధులు నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ వర్కర్లు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ధరలు పెరుగుతున్నా, వేతనాలు పెరగడం లేదన్నారు. జీపీ కార్మికులకు 4 నుండి 6 నెలలగా వేతనాలు పెండిరగ్ ఉన్నాయన్నారు.
కనీస వేతనాలను జీవో 11 లేదా 14 ప్రకారం ఇవ్వాలన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ప్రకారం గ్రామపంచాయతీ వర్కర్లను పర్మినెంట్ చేయాలన్నారు. ఇందిరమ్మ గృహాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో జీపీ కార్మికులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇన్సూరెన్స్ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రతి నెల శానిటేషన్ వస్తువులు, భద్రతా పరికరాలు ఇవ్వాలన్నారు.
ప్రతినెల 5వ తేదీ లోపు జీతాలు ఇవ్వాలని, రోజుకు 8 గంటలే పని చేయించాలన్నారు. ప్రతి ఆదివారం సెలవు ఇవ్వాలని, పంచాయతీ సెక్రెటరీ, సర్పంచుల వేధింపులు ఆపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వెంటనే కార్యచరణ రూపొందించాలని, లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామపంచాయతీ కార్మికులను ఉద్యమ బాట పట్టిస్తామన్నారు.
ధర్నా కార్యక్రమంలో యూనియన్ నాయకులు మోహన్, సాయిబాబా, జీపీ కార్మికులు రమేష్, గంగాధర్, సాయిలు, గంగారం, కిషన్, సుజాత, రాజేశ్వర్, నవీన్, సుమన్ శ్రీకాంత్, దుర్గా పోసాని తదితరులు పాల్గొన్నారు.