నెలాఖరు నాటికి ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి చేయాలి

నిజామాబాద్‌, డిసెంబరు 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మొబైల్‌ యాప్‌ ద్వారా నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి సర్వే ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ బుర్రా వెంకటేశం తదితరులతో కలిసి మంత్రి పొంగులేటి బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఇందిరమ్మ ఇళ్ల సర్వే, గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు, సామాజిక, ఆర్ధిక స్థితిగతుల విశ్లేషణ కోసం చేపట్టిన ఇంటింటి సర్వే, హాస్టల్‌ విద్యార్థులకు కాస్మెటిక్‌ చార్జీల పెంపు అంశాలపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

ఇప్పటికే అన్ని జిల్లాలలో సర్వే ప్రక్రియ కొనసాగుతున్నక్రమంలో స్థానికంగా ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఏవైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా, సర్వేకు వినియోగిస్తున్న మొబైల్‌ యాప్‌లో ఇంకనూ ఏవైనా మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉందా? అని ఆయా జిల్లాల కలెక్టర్లను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ ఒక్క దరఖాస్తుదారుడు మినహాయించబడకుండా ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపల్‌ డివిజన్లు, వార్డులలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరగాలని, 500 మంది దరఖాస్తుదారులకు ఒకరు చొప్పున సర్వేయర్‌ ను, ఐదుగురు సర్వేయర్లకు ఒక సూపర్వైజర్‌ ను నియమించి మొబైల్‌ యాప్‌ వినియోగం, ప్రభుత్వ మార్గదర్శకాలపై పరిపూర్ణమైన అవగాహన కోసం జిల్లా, మండల స్థాయిలలో శిక్షణ ఇప్పించాలని అన్నారు.

ఈ నెల 13,14 తేదీలలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఒక్కో సర్వేయర్‌ రోజుకు కనీసం 25 ఇళ్లను సందర్శించి సర్వే జరిపేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తూ, గడువులోపు పూర్తి చేయాలన్నారు. సర్వేకు వెళ్ళడానికి కనీసం ఒకరోజు ముందే దరఖాస్తుదారులకు సమాచారం అందించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ప్రజల సందేహాలను నివృత్తి చేస్తూ, వారికి అవసరమైన సమాచారం అందించేందుకు వీలుగా టోల్‌ ఫ్రీ నెంబర్‌ ను అందుబాటులో ఉంచాలని, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను వెంటదివెంట పరిష్కరించాలని సూచించారు.

ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా ఎక్కడికక్కడ ఇందిరమ్మ కమిటీలను సైతం సర్వే ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఎక్కడైనా కమిటీలు లేకపోతే తక్షణమే ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లా ఇంచార్జ్‌ మంత్రి అధ్యక్షతన ఇందిరమ్మ ఇళ్ల సర్వే కార్యక్రమంపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, నిజామాబాద్‌ జిల్లాలో ప్రజాపాలన సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 3.20 కుటుంబాలు దరఖాస్తులు చేసుకున్నాయని మంత్రి దృష్టికి తెచ్చారు. తదనుగుణంగా ఇప్పటికే జిల్లాలో 680 మంది సర్వేయర్లను ఏర్పాటు చేసి, 5800 కుటుంబాల వివరాలను సర్వే ద్వారా సేకరించడం పూర్తయ్యిందని వివరించారు. పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద జిల్లాలోని జక్రాన్పల్లి మండలం మాదాపూర్‌, ఆర్మూర్‌ మున్సిపాలిటీలో ఒక వార్డులో ప్రయోగాత్మకంగా సర్వే కూడా జరిగిందని తెలిపారు.

ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలో సర్వేయర్లను అదనంగా నియమించి, నిర్దిష్ట గడువులోపు ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని, సర్వే ప్రక్రియను పకడ్బందీగా పర్వవేక్షిస్తున్నామని అన్నారు. కాగా, మొబైల్‌ యాప్‌ లో ఫోటోలను పీడీఎఫ్‌ మోడ్‌ లో అప్లోడ్‌ చేయడానికి కొంత ఎక్కువ సమయం పడుతున్నందున, దానిని జె.పీ.ఈ.జీ మోడ్‌ లో మార్చితే బాగుంటుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించగా, ఈ మేరకు మొబైల్‌ ఆప్‌ అప్లికేషన్లో మార్పులు చేయిస్తామని మంత్రి పొంగులేటి సానుకూలంగా స్పందించారు.

గ్రూప్‌ -2 పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల గురించి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ బుర్ర వెంకటేశం మాట్లాడుతూ, ఈసారి అభ్యర్థులకు ప్రత్యేకంగా ఓఎంఆర్‌ షీట్‌ అందించడం జరుగుతుందని అన్నారు. గ్రూప్‌ 2 పరీక్షల నిర్వహణ సంబంధించి చేసిన ఏర్పాట్లను, పాటించాల్సిన నియమాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

ప్రతి పరీక్ష చాలా కీలకమని, ఎక్కడ ఎటువంటి చిన్న పొరపాటు జరగకుండా పకడ్బందీగా పరీక్షను నిర్వహించాలని చైర్మన్‌ కలెక్టర్లను కోరారు. ప్రతి అభ్యర్థికి ఓఎంఆర్‌ షీట్‌ ప్రత్యేకంగా ఉన్నందున పరీక్ష హాల్‌లో అభ్యర్థి రాకపోయినా అతని స్థానంలో ఓఎంఆర్‌ షీట్‌ ప్రశ్నాపత్రం అలాగే పెట్టాలని, ఒకరి ఓఎంఆర్‌ షీట్‌ మరొకరికి ఇవ్వడానికి వీలు లేదని, పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు సకాలంలో చేరుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు.

పరీక్షా ఏర్పాట్లపై కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు వివరిస్తూ, ఈ నెల 15, 16 తేదీలలో జరిగే గ్రూప్‌ -2 పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. జిల్లాలో మొత్తం 19854 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని, 63 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ నడుమ పకడ్బందీగా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఇంటింటి సర్వే ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయ్యిందని అన్నారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

పునరావాసం కోసం నిజామాబాద్‌ జిల్లా ఎంపిక

Print 🖨 PDF 📄 eBook 📱 హైదరాబాద్‌, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »