వచ్చే ఐదేళ్లలో 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు

నిజామాబాద్‌, డిసెంబరు 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలంలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శుక్రవారం
సందర్శించారు. ఎమ్మెల్యేలు పి.సుదర్శన్‌ రెడ్డి, భూపతి రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, పైడి రాకేష్‌ రెడ్డి, లక్ష్మీకాంత్‌ రావు, నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాహుల్‌ బొజ్జ, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తదితరులతో కలిసి ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఎస్సారెస్పీ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు చేపట్టాల్సిన పనుల గురించి చర్చించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల నిర్వహణను సమర్ధవంతంగా చేపట్టాలని, ఎవరైనా నిర్లక్ష్యానికి తావిస్తే సస్పెండ్‌ చేసేందుకు వెనుకాడబోమని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు. ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డిల అభ్యర్థన మేరకు ప్రాణహిత-చేవెళ్ల 21వ ప్యాకేజీ అసంపూర్తి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఈ పనులకు అవసరమైన నిధులను కేటాయిస్తామని అన్నారు.

సమీక్ష అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలోని చారిత్రాత్మకమైన శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌ ప్రాజెక్టులకు పూర్వవైభవం చేకూరుస్తామని అన్నారు. 112 టీఎంసీల నీటి నిలువ కెపాసిటీ కలిగిన ఎస్సారెస్పీ ప్రాజెక్టు సామర్థ్యం ప్రస్తుతం 80 టీఎంసీలకు పడిపోయిందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ స్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఎస్సారెస్పీలో పూడికతీత పనులు చేపట్టి నీటి నిలువ సామర్ధ్యాన్ని పెంపొందిస్తామని అన్నారు.

గడిచిన పదేళ్ల కాలంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన నీటి పారుదల రంగాన్ని తిరిగి బలోపేతం చేసేందుకు ఇరిగేషన్‌ శాఖలో సమూల ప్రక్షాళన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇందులో భాగంగానే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవధిలోని నీటిపారుదల శాఖలో 700 మంది ఏ.ఈలను కొత్తగా నియమించామని, 1800 మంది లష్కర్లను పొరుగు సేవల పద్ధతిలో నియమించామని మంత్రి వివరించారు. మరో 1300 పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కు లేఖ రాశామని తెలిపారు. గత ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను అప్పుల రూపంలో తెచ్చి ప్రాజెక్టుల పేరిట వెచ్చించినప్పటికీ, రాష్ట్ర రైతాంగానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని మంత్రి ఆక్షేపించారు.

వచ్చే ఐదేళ్లు ప్రతి ఏటా ఖరీఫ్‌, యాసంగి సీజన్లలో సన్నాలకు 500 బోనస్‌ తప్పక చెల్లిస్తామని, ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని భరోసా కల్పించారు. సన్నాలలో ఏ రకం సన్న ధాన్యమైనా సరే, మద్దతు ధరతో పాటు బోనస్‌ వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. అయితే, వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్న మేరకు తెలంగాణ సోనా, హెచ్‌ఎంటీ, బీపీటీ రకాలు సాగు చేయడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు.

వచ్చే సంక్రాంతి పండుగ తరువాత ప్రభుత్వం రైతు భరోసాను అమలు చేయనుందని వెల్లడిరచారు. సామాజిక న్యాయం మూలసూత్రంగా ప్రజాపాలన చేపట్టిన తమ ప్రభుత్వం, రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారి అభ్యున్నతికి పాటుపడుతూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. అధికారం చేపట్టిన 10 నెలల వ్యవధిలోనే 55 వేల ఉద్యోగ నియామకాలు చేశామని, యువతలో నైపుణ్యాభివృద్ది పెంపొందించేందుకు హైదరాబాద్‌ లో అంతర్జాతీయ స్థాయి స్కిల్‌ యూనివర్సిటీ నెలకొల్పామని, ఐటీఐలలో ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టి అప్‌ గ్రేడ్‌ చేశామని వివరించారు.

సమీక్షలో అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, రాష్ట్ర సహకార లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి, ఐడీసీఎంఎస్‌ చైర్మన్‌ తారాచంద్‌, ఇరిగేషన్‌, సివిల్‌ సప్ప్లైస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, హెలికాప్టర్‌ ద్వారా ఎస్సారెస్పీ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పూలబొకేలు అందించి ఘన స్వాగతం పలికారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 బుధవారం, డిసెంబరు 18, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »