సంక్షేమ హాస్టళ్లలో అట్టహాసంగా కామన్‌ డైట్‌ ప్లాన్‌ ప్రారంభం

నిజామాబాద్‌, డిసెంబరు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒకే విధమైన డైట్‌ ప్లాన్‌ ను ప్రవేశపెట్టగా జిల్లాల్లోని వివిధ వసతి గృహాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు శనివారం ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు వర్ని మండలం కోటయ్య క్యాంప్‌ లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో కామన్‌ డైట్‌ ప్లాన్‌ ను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి కలెక్టర్‌ మాట్లాడుతూ, చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఉద్బోధించారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత లక్ష్యాల దిశగా ముందుకు సాగాలన్నారు. అన్ని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు వీలుగా ప్రభుత్వం కామన్‌ డైట్‌ ప్లాన్‌ ను ప్రారంభించిందని తెలిపారు.

వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం 40 శాతం డైట్‌ చార్జీలను, 200 శాతం కాస్మొటిక్‌ చార్జీలను పెంచడం జరిగిందన్నారు. తద్వారా పిల్లలకు పోషకాలతో కూడిన బలవర్ధక ఆహారం అందాలని, వారు మరింత మెరుగైన విద్యను అభ్యసించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.

గణితం, ఆంగ్లం సబ్జెక్టులు అంటే భయాన్ని విడనాడాలని, పాఠాలు అర్ధం కాకపోతే సంకోచించకుండా ఉపాధ్యాయులను అడిగి సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నామనే భావనను దరి చేరనివ్వకుండా ఏకాగ్రతతో చదువుకుని జీవితంలో స్థిరపడడం ద్వారా కన్నవారి కలలు నిజం చేయాలని, గురువులకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. భవిష్యత్తులో ఎంత ఎత్తుకు ఎదిగినా, తల్లిదండ్రులను మర్చిపోకుండా వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని మార్గనిర్దేశం చేశారు.

అంతకుముందు కలెక్టర్‌ జిల్లా కేంద్రంలోని కోటగల్లీలో గల బీసీ, ఎస్సీ బాలికల వసతి గృహాలను తనిఖీ చేశారు. కలెక్టర్‌ వెంట నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌, జిల్లా బీసీ సంక్షేమ సహాయ అధికారి నర్సయ్య, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి భూమయ్య, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఏ.ఓ బి.సహదేవ్‌, సంక్షేమ వసతి గృహాల నిర్వాహకులు రాధారాణి, కల్పన తదితరులు ఉన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 బుధవారం, డిసెంబరు 18, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »