కామారెడ్డి, డిసెంబరు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సంక్షేమ వసతి గృహల్లోని విద్యార్థులకు నూతనంగా ప్రారంభించిన కామన్ డైట్ సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా ఉన్నత చదువులు అభ్యసించి మంచి పదవుల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం పెద్దకొడప్గల్ తెలంగాణ సాంఫీుక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాలలో నూతన కామన్ డైట్ ను ప్రారంభించారు.
తొలుత కలెక్టర్కు విద్యార్థినులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 8 సంవత్సరాల అనంతరం ప్రభుత్వం డైట్ చార్జీలు 40 శాతం పెంచి అన్ని సంక్షేమ హాస్టళ్లలో ఒకే విధమైన మెనూ పాటించాలని తెలిపారు. అదేవిధంగా 16 సంవత్సరాల అనంతరం కాస్మోటిక్స్ చార్జీలు 200 శాతం పెంచిందని తెలిపారు.
విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. వారం మెనూలో మార్పులు తీసుకరావడం జరిగిందని, చికెన్, మటన్ వంటి పౌష్టికాహారం అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించడంతో పాటు ఉన్నత విద్యను అభ్యసించుటకు దోహదపడుతుందని అన్నారు. యంగ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మద్నూర్ లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు అందిపుచ్చుకొని ఉజ్వల భవిష్యత్తు సాధించాలని తెలిపారు. జిల్లా, మండల, ఇన్స్టిట్యూట్ వారీగా ఫుడ్ సేఫ్టీ కమిటీ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా కమిటీలు వంటలను రుచి చూసిన తర్వాతనే విద్యార్థులకు భోజనం అందించడం జరుగుతుందని తెలిపారు. మండల, జిల్లా టీమ్ లు కూడా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల పోషకులు, ప్రిన్సిపాల్, ఆర్సిఒ లు కూడా పర్యవేక్షిస్తూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా, లేదా పరిశీలించాలని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
అనంతరం డార్మీటరీ, టాయిలెట్స్ లను పరిశీలించారు. అనంతరం రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీ ఆవరణలో కలెక్టర్ మొక్కను నాటారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి కిషన్, ప్రిన్సిపాల్ సునీత, తహసీల్దార్ దశరథ్, టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.