కామారెడ్డి, డిసెంబరు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తాడువాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో ఆదివారం దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ శబరిమాత ఆశ్రమంలో ప్రతి సంవత్సరం దత్తాత్రేయ ఉత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆశ్రమం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్యన వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి ఆశ్రమంలో ప్రత్యేక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం గ్రామంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు ద్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా శ్రీ శబరిమాత ఆశ్రమంలో కొలువైన శ్రీ శబరిమాత పాలరాతి విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి సంవత్సరం అమ్మవారిని దత్తాత్రేయ ఉత్సవాల సందర్భంగా దర్శించుకుంటే అనుకున్నది అనుకున్నట్లుగా అవుతుందనే నమ్మకంతో భక్తులు ప్రతి సంవత్సరం శ్రీ శబరిమాత ఆశ్రమానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.
శ్రీ శబరిమాత ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించారు. రాత్రి వరకు ఉత్సవాలు కొనసాగుతూనే ఉంటాయి. రాత్రి సమయంలో రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవాలు సోమవారం సైతం కొనసాగుతాయి. సోమవారం ఉదయం గ్రామంలో అమ్మవారి పాదుకల ఊరేగింపు వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం శ్రీ శబరి మాత ఆశ్రమం పక్కనే ఉన్న గుట్టపైన ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి అమ్మవారి పాదుకపూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. రాత్రి సమయంలో ప్రత్యేక భజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భజన మండలి భక్తులు కార్యక్రమంలో పాల్గొని భజన సంకీర్తనలు నిర్వహిస్తారు. కార్యక్రమంలో ప్రతినిధులు, ఆలయ కమిటీ నిర్వాహకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.