మోర్తాడ్, డిసెంబరు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మోర్తాడ్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు.
డైట్ చార్జీలను 40శాతం వరకు పెంచుతూ ప్రభుత్వం ఇటీవలే అమలులోకి తెచ్చిన కొత్త మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అన్నది గమనించారు. ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేయాలని నిర్వాహకులకు సూచించారు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా, మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు.
విద్యార్థులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించి, అందుబాటులో ఉంచిన ఔషధాలు, వాటి కాలపరిమితిని తనిఖీ చేశారు. ఇదివరకు ఆరోగ్య పరీక్షలు జరిపిన విద్యార్థులకు కూడా మళ్లీ క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ నిర్వహించాలని అన్నారు. అనంతరం పదవ తరగతి గదిని సందర్శించిన కలెక్టర్ విద్యార్థులను పలకరించారు. పలు ప్రశ్నలు అడిగి వారి విద్యా సామర్ధ్యాన్ని అంచనా వేశారు.
చక్కగా చదువుకుని వృద్ధిలోకి రావాలని మార్గనిర్దేశం చేశారు. ఆయా సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి, వారికి ప్రత్యేక బోధన అందిస్తూ, మరింత మెరుగైన ఫలితాలు వచ్చేలా అంకిత భావంతో కృషి చేయాలని పాఠశాల నిర్వాహకులను కలెక్టర్ ఉద్బోధించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజా గౌడ్, ఎంపీడీవో తిరుమల, తహసిల్దార్ సత్యనారాయణ, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.