నిజామాబాద్, డిసెంబరు 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మాతాశిశు సంరక్షణ (ఎంసీహెచ్), క్రిటికల్ కేర్ యూనిట్ లతో కూడిన భవన సముదాయాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు.
సుమారు 38.75 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ అన్ని హంగులతో అందుబాటులోకి తెచ్చిన ఎంసీహెచ్, క్రిటికల్ కేర్ యూనిట్ లను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ నెల 22న లాంఛనంగా ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఎంసీహెచ్ భవన సముదాయాన్ని శుక్రవారం సందర్శించి ప్రారంభోత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జీం4 అంతస్థులతో కూడిన ఈ భవన సముదాయంలో అందుబాటులోకి తెస్తున్న వివిధ విభాగాలను సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రారంభోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వివిధ అంతస్థులలో నెలకొల్పిన ఆయా విభాగాలకు సంబంధించిన వివరాలు స్పష్టంగా తెలిసేలా బోర్డులను ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. భవన సముదాయం లోపల, బయట పరిసర ప్రాంతాలలో ఎక్కడ కూడా చెత్తాచెదారం లేకుండా చక్కగా శుభ్రం చేయించాలని అన్నారు.
కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ, జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్, ఇంజనీరింగ్ విభాగం అధికారి ప్రవీణ్, వైద్యాధికారులు ఉన్నారు.