నిజామాబాద్, డిసెంబరు 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆయా రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. ప్రత్యేకించి ప్రస్తుత యాసంగి సీజన్లో పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం జరిగింది.
2024-25 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి, ప్రస్తుత యాసంగిలో రైతాంగానికి అందించాల్సిన పంట రుణాలు తదితర అంశాలపై ఆయా బ్యాంకుల వారీగా అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఈ ఏడాది ఖరీఫ్ లో రూ. 2640 కోట్లు పంట రుణాలుగా అందించాలని లక్ష్యం కాగా, రూ. 2285.25 కోట్లు పంపిణీ చేసి 86.56 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందని, పూర్తి స్థాయిలో పంట రుణాల లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంకర్లు అందరూ చొరవ చూపాలన్నారు. యాసంగిలో రూ.1762.74 కోట్ల రుణ పంపిణీ లక్ష్యాన్ని అధిగమించాలని అన్నారు.
గత 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఖరీఫ్ సీజన్ లో రూ. 2437 కోట్ల రుణాలకు గాను రూ. 1801.72 కోట్లు పంపిణీ చేసి 73.94 లక్ష్యాన్ని సాధించారని, రబీ సీజన్లో రూ.1625.20 కోట్లకు గాను రూ.1545.65 కోట్లు పంపిణీ చేసి 95.11 శాతం లక్ష్య సాధన జరిగిందని తెలిపారు. ఆయా రంగాల్లో పలు బ్యాంకులు లక్ష్యానికి అనుగుణంగా రుణాలు అందిస్తుండగా, మరికొన్ని బ్యాంకులు వెనుకంజలో ఉండిపోతున్నాయని అన్నారు.
క్రమం తప్పకుండా సమీక్ష జరుపుతూ, వంద శాతం లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా బ్యాంకులు లేని చోట కొత్త బ్రాంచులను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని బ్యాంకర్లకు హితవు పలికారు. నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి లేఖ ద్వారా ప్రతిపాదించిన మేరకు సిరికొండ మండలం చిమన్ పల్లి, ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామాలలో బ్యాంకు శాఖలను ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.
వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను రైస్ మిల్లర్లకు పెండిరగ్ లో ఉన్న బ్యాంకు గ్యారంటీలను వెంటనే మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. వ్యవసాయ శాఖతో పాటు ఇతర పశు సంవర్ధక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర శాఖలతో సమన్వయము చేసుకుని ప్రభుత్వ పథకాల కింద ఎంపికైన లబ్దిదారులకు సకాలంలో రుణాలు అందించి స్వయం ఉపాధికి చేయూతనివ్వాలని హితవు పలికారు.
రుణాలు తీసుకున్న వారు యూనిట్లు స్థాపించారా లేదా అన్నది నిశితంగా పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. తదుపరి సమావేశం నాటికి పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు పూర్తి స్థాయిలో లింకేజీ రుణాలు పంపిణీ చేయాలని, సబ్సిడీ రుణాల పంపిణీలో జాప్యం చేయవద్దని సూచించారు. వీధి వ్యాపారులకు విరివిగా ముద్ర రుణాలతో పాటు స్టాండ్ అప్ ఇండియా కింద రుణాలు అందించాలన్నారు.
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో అందిస్తున్న శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు యూనిట్ల స్థాపన కోసం రుణాలు అందించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో నూతనంగా నెలకొల్పుతున్న మోడల్ సీ.ఎస్.సీ – ఐ.సీ.టీ లకు సంబంధించి రూపొందించిన గోడప్రతులను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు.
జిల్లాలో మారుమూల గ్రామాల్లో డిజిటల్ సేవలతో పాటు బ్యాంకింగ్ ఆధార్ సేవలను అనుసంధానిస్తూ,100 మంది నిరుద్యోగులకు ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం కింద ఉపాధి అవకాశం కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడానికి ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కింద మహిళా పొదుపు సంఘాల సభ్యులకు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉపాధి కల్పించనున్నట్లు అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు.
సమావేశంలో ఆర్బీఐ ఎల్.డీ.ఓ పృథ్వీ, డీఆర్డీఓ సాయాగౌడ్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ అశోక్ చవాన్, నాబార్డు ఏజీఎం ప్రవీణ్ కుమార్, మెప్మా పీ.డీ రాజేందర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.