నిజామాబాద్, డిసెంబరు 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తూ నిజామాబాద్ జిల్లాను వైద్య సేవల హబ్‌గా తీర్చిదిద్దాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ వైద్యాధికారులకు హితవు పలికారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రూ. 38.75 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎం.సీ.హెచ్, క్రిటికల్ కేర్ యూనిట్లను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభోత్సవాలు చేశారు.
అందుబాటులోకి వచ్చిన నూతన వైద్య సేవలను పరిశీలించి, వైద్యాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు కోటీ 56 లక్షల రూపాయల వ్యయంతో రెంజల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ లోని జిల్లా జనరల్ ఆసుపత్రిని సందర్శించి వివిధ విభాగాలను తనిఖీ చేశారు. రోగులను పలకరించి, వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు.
అనంతరం కాన్ఫరెన్స్ హాల్ లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వైద్య సేవల స్థితిగతులపై వివిధ విభాగాల వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒక్కో విభాగం వారీగా జీజీహెచ్ ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఇంకనూ అవసరమైన సౌకర్యాలు, వైద్యులు, సిబ్బంది ఖాళీలు, వైద్య పరికరాల ఆవశ్యకత గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ మంత్రి దృష్టికి తెచ్చారు.
సదుపాయాలను మెరుగుపరుస్తూ, ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సమీక్షలో పాల్గొన్న జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, రాకేష్ రెడ్డి తదితరులు కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. జీజీహెచ్, ఎంసీహెచ్ ఆసుపత్రులలో బోరు మోటార్ల ఏర్పాటుకు అవసరమైన వ్యయాన్ని తన నియోజకవర్గ కొత్త నిధుల నుండి మంజూరు చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సమీక్ష సందర్భంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, వైద్య సేవల విషయంలో నిజామాబాద్ జిల్లాకు ఇదివరకు ఎంతో మంచి పేరు ఉండేదని, ప్రస్తుతం కూడా వైద్యులు, సిబ్బంది అందరూ అంకితభావం, నిబద్దతతో పనిచేస్తూ పూర్వ ప్రతిష్టను పునరుద్ధరింపజేయాలని సూచించారు. ప్రభుత్వపరంగా ఎన్ని సదుపాయాలు కల్పించినా, వైద్య సేవల్లో లోపాలు ఉంటే ప్రయోజనం శూన్యంగా మారుతుందన్నారు. పేదలకు మెరుగైన సేవలు అందించడమే పరమావధిగా ప్రతి ఒక్కరు సేవా తత్పరతతో విధులు నిర్వర్తిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని హితవు పలికారు.
ప్రభుత్వ వైద్యులు విధులకు ఎగనామం పెట్టి ప్రైవేట్ క్లినిక్ లు, ప్రైవేట్ ప్రాక్టీస్ లకు పరిమితమైతే సహించే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో నిర్వహణపరమైన లోపాలను సరిదిద్దుకుని, వచ్చే ఉగాది నాటికి వంద రోజుల్లోపు పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించేలా అంకితభావంతో పని చేయాలని సూచించారు. సబ్ సెంటర్ మొదలుకుని జిల్లా ఆసుపత్రులు, జీజీహెచ్ హాస్పిటల్ కు అవసరమైన అన్ని సదుపాయాలు తక్షణమే సమకూరుస్తామని, వైద్యులు, సిబ్బంది ఖాళీలను భర్తీ చేసి అధునాతన వైద్య పరికరాలను మంజూరు చేస్తామని అన్నారు.
ఆయా ప్రాంత ప్రజల అవసరాలు, దూర భారం తదితర అంశాలను బట్టి రాష్ట్రంలో ఎన్ని ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా వైద్యులు, సిబ్బంది సేవాభావంతో విధులు నిర్వర్తిస్తే సర్కారీ దవాఖానాల పట్ల ప్రజల్లో భరోసా పెరుగుతుందన్నారు.
ముఖ్యంగా ఆదిలాబాద్ వంటి మారుమూల జిల్లాల వారు హైదరాబాద్ కు వెళ్లేందుకు దూరభారమైనందున మధ్యస్థంగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యారోగ్య శాఖ పనితీరులో మార్పు రావాలని, నిజామాబాద్ జిల్లాను వైద్య సేవల హబ్ గా తీర్చిదిద్దాలని మంత్రి ఉద్బోధించారు. మందుల కొరత, వైద్య సేవలలో నిర్లక్ష్యం అనే ఫిర్యాదులు లేకుండా అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాకు వాస్క్యులర్ యాక్సెస్ సెంటర్, ట్రామా కేర్ యూనిట్, కాన్సర్ చికిత్స కేంద్రాన్ని వచ్చే మూడు, నాలుగు నెలల వ్యవధిలోనే మంజూరు చేసేందుకు చొరవ చూపుతానని తెలిపారు.
సమీక్షా సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, డీఎంఈ డాక్టర్ వాణి, అదనపు కలెక్టర్ అంకిత్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి ఘన స్వాగతం పలికిన అధికారులు, ప్రజాప్రతినిధులు
హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ లను జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ తదితరులు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు.