మెరుగైన విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం

నిజామాబాద్‌, డిసెంబరు 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ప్రజలకు మెరుగైన విద్య వైద్యం అందుబాటులోకి తెస్తూ సామాజిక భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండల కేంద్రంలో రూ. కోటి 56 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు.

రాష్ట్రంలో ఇంకనూ 300 పైచిలుకు హెల్త్‌ సబ్‌ సెంటర్లు, 170 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించామన్నారు. గ్రామీణ మారుమూల ప్రాంతాలతో పాటు ఆదివాసి ప్రాంతాలలో వీటి ఏర్పాటుకు తొలి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి తెలిపారు. అత్యవసర సమయాలలో అన్ని ప్రాంతాల ప్రజలకు ప్రాథమిక చికిత్స అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం ఇటీవలే 213 నూతన అంబులెన్స్‌ లను ప్రజలకు అంకితం చేసిందని గుర్తు చేశారు. ఇంకనూ మరో 85 వరకు అంబులెన్స్‌ లను అందుబాటులోకి తెస్తామని వివరించారు.

102 అమ్మఒడి వాహనాలు కూడా ఆయా ప్రాంతాలకు సమకూరుస్తామని అన్నారు. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన క్షతగాత్రుల ప్రాణాలను కాపాడేందుకు వీలుగా జాతీయ రహదారులపై ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేస్తామని, వాటికి అంబులెన్స్‌ లను అనుసంధానం చేస్తామని తెలిపారు. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలకు క్యాన్సర్‌ చికిత్స కేంద్రాలతో పాటు వాస్క్యులర్‌ యాక్సెస్‌ సెంటర్‌ లు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తించామన్నారు. వైద్య సేవల కోసం పేద ప్రజలు అప్పుల పాలు కాకుండా, అభద్రతాభావానికి గురికాకుండా వారికి అన్ని విధాలుగా ఆరోగ్య భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని అన్నారు.

గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందేలా ప్రతి చోట సరిపడా వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా 90 శాతం వరకు ఖాళీలను భర్తీ చేస్తున్నామని వివరించారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచుతూ, అనేక రకాల చికిత్సలను కొత్తగా ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చడం జరిగిందన్నారు.

అదనపు లేబరేటరీలను ఏర్పాటు చేస్తూ, డ్రగ్‌ ఇన్స్పెక్టర్లు, ఫుడ్‌ ఇన్స్పెక్టర్లను నూతనంగా నియమిస్తున్నామని వివరించారు. అవసరం అయిన చోట ఐవీఎఫ్‌ సెంటర్లను కూడా నెలకొల్పుతున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రజా సంక్షేమం, వారి ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ముందుకెళ్తున్న తమ ప్రభుత్వానికి ప్రజలు అండదండగా నిలవాలని కోరారు.

కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ, శాసనసభ్యులు సుదర్శన్‌ రెడ్డి, డాక్టర్‌ భూపతి రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, రాష్ట్ర సహకార యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్‌ సభ్యులు గడుగు గంగాధర్‌, నుడా చైర్మన్‌ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »