బాన్సువాడ, డిసెంబరు 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్ మండల కేంద్రంలో రూ. 1.44 కోట్ల నిధులతో చేపట్టనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, విద్య, వైద్యం, సాగు, తాగునీరు, రవాణా, విద్యుత్ సరఫరా వంటి వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగానే నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్, చందూర్ మండల కేంద్రాలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేయించామని తెలిపారు. నిజానికి ఏడాది క్రితమే చందూర్ కు పీ.హెచ్.సీ మంజూరైనప్పటికీ, స్థలం అందుబాటులో లేకపోవడంతో జాప్యం జరిగిందన్నారు.
ఈ క్రమంలో స్థానికులైన చంద్రావతి-విద్యాసాగర్ దంపతులు ముందుకు వచ్చి స్వర్గీయ సుబ్బారావు పేరిట స్థలాన్ని దానం చేయడంతో పి హెచ్ సి నిర్మాణానికి మార్గం సుగమం అయ్యిందన్నారు. ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి రావాలనే సదాశయంతో సుమారు కోటి రూపాయల విలువ చేసే భూమిని అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారని కొనియాడిన పోచారం, స్థల దాతలైన చంద్రావతి విద్యాసాగర్ దంపతులను స్థానికులతో కలిసి ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి స్వర్గీయ సుబ్బారావు పేరిట నామకరణం చేయడం జరుగుతుందని ప్రకటించారు.
బాన్సువాడ నియోజకవర్గంలోని మోస్రా, హనుమాజీపేట్, పోతంగల్, రుద్రూర్ లలో ఇదివరకే పీహెచ్సీలు ఉండగా, కొత్తగా నస్రుల్లాబాద్, చందూర్ లకు మంజూరు చేయించామన్నారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందాలనే లక్ష్యంతో అన్ని మండల కేంద్రాలు, ఆయా గ్రామాలలో పీ.హెచ్.సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఆరోగ్య ఉపకేంద్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. బాన్సువాడలో 100 పడకల ఆసుపత్రి భవనం స్థానంలో నూతన భవన సముదాయం నిర్మాణానికి 37 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని, దీనితో పాటు మరో వంద పథకాలతో మాతాశిశు ఆసుపత్రిని మంజూరు చేయించామని వివరించారు.
వర్ని మండల కేంద్రంలో రూ. 13 కోట్లతో చేపట్టిన 30 పడకల ఆసుపత్రి నూతన భవన నిర్మాణం పనులు దాదాపుగా పూర్తయ్యాయని, త్వరలోనే దీనిని ప్రారంభించడం జరుగుతుందన్నారు. కోటగిరిలోని 10 పడకల ఆసుపత్రిని 50 పడకల స్థాయికి పెంచడం జరిగిందని, అవసరమైన అన్ని గ్రామాలలో పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, హెల్త్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేయిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వపరంగా అవసరమైన అన్ని మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించడం తమ బాధ్యత అని, అయితే వైద్యులు, సిబ్బంది ప్రజలకు అంకితభావంతో సేవలందించినప్పుడే పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందుతుందని, ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని పోచారం సూచించారు.
విద్య, వైద్యంతో పాటు సెగ్మెంట్లో సాగునీటి రంగానికి పెద్దపీట వేశామన్నారు. నిజాంసాగర్ కాల్వల ఆధునికీకరణ కోసం రూ.900 కోట్లు వెచ్చించామని, డిస్ట్రిబ్యూటరీలకు మరో రూ. 200 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. నిజాంసాగర్ ద్వారా నీటి సౌలభ్యత లేని చందూర్, కారేగాం, లక్ష్మాపూర్ వంటి గ్రామాల రైతాంగానికి సాగునీటి వసతి కోసం నిజాంసాగర్ కెనాల్ లో సుమారు 150 కోట్ల రూపాయలతో లిఫ్ట్ నిర్మాణం జరిపిస్తున్నామని తెలిపారు. దీనిద్వారా సుమారు 10 వేల ఎకరాలకు సాగు నీరు సమకూరుతుందని అన్నారు.
అదేవిధంగా రూ.250 కోట్లతో చేపట్టిన సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ రిజర్వాయర్ ద్వారా మరో 14 వేల ఎకరాలకు సాగునీటి సౌలభ్యం సమకూరుతుందని పోచారం తెలిపారు. రిజర్వాయర్ నిర్మాణంలో సుమారు 600 ఎకరాల అటవీ భూమి ముంపునకు గురవుతుండగా, ఆ మేరకు ఇతర ప్రాంతాలలో ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు సమకూర్చేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపారని ఈ సందర్భంగా పోచారం స్థానికుల తరపున కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా బాన్సువాడ నియోజకవర్గానికి రూ. 5 వేల కోట్లతో 11 వేల ఇళ్లను మంజూరు చేశామని అన్నారు. ఇదివరకు గృహలక్ష్మి పథకం కింద మంజూరీలు తెలిపిన వారిలో సొంత స్ధలాలు కలిగి ఉన్న అర్హులైన వారిని ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులుగా ఎంపిక చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎంతో విలువైన స్థలాన్ని దానం చేయడం గొప్ప విషయమని దాతలను అభినందించారు. వారి కోరిక మేరకు పీ.హెచ్.సీకి స్వర్గీయ సుబ్బారావు పేరిట నామకరణం చేసేందుకు అధికారికంగా ప్రొసీడిరగ్స్ జారీ చేస్తామని అన్నారు. వైద్యులు, సిబ్బంది సేవాభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు.
ప్రతిఒక్కరు సమయపాలన పాటిస్తూ, ఏ చిన్న ఫిర్యాదుకు ఆస్కారం లేకుండా బాధ్యతాయుతంగా పని చేయాలని, పేదలకు సేవలందించడమే పరమావధిగా భావించాలని హితవు పలికారు. జిల్లాకు కొత్తగా 8 అంబులెన్సులు కేటాయించగా, వాటిలో 3 అంబులెన్సులు బాన్సువాడ నియోజకవర్గానికే మంజూరు అయ్యాయని అన్నారు. ఇటీవల డీఎస్సీ ద్వారా కొత్తగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టడంతో పాఠశాలల్లో టీచర్ల కొరత దాదాపుగా దూరమయ్యిందని, నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టళ్లలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం మెస్ చార్జీలు 40 శాతానికి పైగా పెంచుతూ, కొత్త మెనూను అమలు చేస్తోందని అన్నారు.
మండల స్థాయి అధికారులు క్రమం తప్పకుండా సంక్షేమ వసతి గృహాలు, హాస్టళ్లను సందర్శిస్తూ మెనూ పక్కాగా అమలవుతోందా లేదా అన్నది పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, పంచాయతీరాజ్ ఈ.ఈ శంకర్, ఎంపీడీఓ నీలావతి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్, మాజీ ఎంపిపి లావణ్య, మాజీ జెడ్పిటీసీ అంబర్ సింగ్, మాజీ సర్పంచ్ సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.