నిజామాబాద్, డిసెంబరు 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భారత ఆర్థిక వ్యవస్థ ఆందోళనకర స్థాయిలో ఉన్న సమయంలో ఆధ్యుడుగా నిలిచి పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన భారత ఆర్థిక శిల్పి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్‌లో నిర్వహించిన మన్మోహన్ సంతాప సమావేశంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బార్ అసోసియేషన్ తరుపున రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం జగన్ న్యాయవాదులనుద్దేశించి ప్రసంగించారు. దేశ ఎగుమతులు, దిగుమతులకు సరిపడ విదేశీ ద్రవ్యం లేని పరిస్థిస్థులలో నూతన ఆర్థిక సంస్కరణలు 1991 లో ప్రవేశపెట్టి ఆర్ధిక మంత్రిగా దేశ ప్రజలమన్ననలు చురగొన్న ఆర్థికవేత్తగా అభివర్ణించారు. వ్యాపారవాణిజ్య రంగాలలో భారత కీర్తిప్రతిష్ఠలు శిఖరాగ్రానికి చేర్చిన రూపశిల్పిగా పేర్కొన్నారు.
దేశ ప్రధానమంత్రి గా కూడా మరిన్ని ఆర్ధిక సంస్కరణలు తీసుకు వచ్చారని, ప్రజలకు అందుబాటులోకి నూతన చట్టాలను చేర్చిన ఆచరణ శీలి మన్మోహన్ అని జగన్ తెలిపారు. దేశ ఆర్ధిక మంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా ఎనలేని సేవలు అందించిన ఒక మేధావిని దేశం కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రభుత్వ న్యాయవాది అమిదాల సుదర్శన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, ఆకుల రమేశ్, ఆశ నారాయణ ఆర్ రాజలింగం తదితరులు డాక్టర్ మన్మోహన్ సింగ్ భారాతవనికి చేసిన ప్రగతిఫలాలు నేడు దేశ ప్రజలు అనుభవిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు పెండెమ్ రాజు, కార్యదర్శి దొన్పల్ సురేశ్, కోశాధికారి దీపక్, అయ్యూబ్, మనిక్ రాజ్, రవి, పులి జైపాల్ న్యాయవాదులు పాల్గొన్నారు.