కామారెడ్డి, డిసెంబరు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇందిరమ్మ ఇండ్ల సర్వే పనులు వేగవంతంగా, నాణ్యతతో, పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పారిశుధ్యం, త్రాగు నీరు, ఇంటి పన్ను వసూళ్లు, సి.సి. చార్జీలు, ట్రాక్టర్ నెలవారీ వాయిదాల చెల్లింపులు, కంపోస్టు ఎరువుల తయారు, భవన నిర్మాణాల అనుమతులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, వనమహోత్సవం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, మహిళా శక్తి, అంశాలపై ఎంపిడిఒలు, ఎంపీఒ లు, మిషన్ భగీరథ ఇంజనీర్లు, గ్రామీణాభివృద్ధి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే కొనసాగుతున్నదని, జనవరి 3 లోగా సర్వే పూర్తిచేయాలని అన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు సర్వే తీరును పరిశీలించాలని తెలిపారు. జిల్లాలో 2,38,682 మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటివరకు 1,39,194 సర్వే జరిగిందని, 62 శాతం మేర సర్వే పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించాలని తెలిపారు. మురికి కాల్వల్లో చెత్తతో నీరు రోడ్లపైకి రాకుండా శుభ్ర పరచాలని తెలిపారు. దోమల వ్యాప్తి నివారణకై పిచికారి చేయాలనీ అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. గత సంవత్సరంలోని అనుభవాలను దృష్టిలో ఉంచుకొని త్రాగు నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని తెలిపారు. మిషన్ భగీరథ నీటి సరఫరా, ఏమైనా లీకేజి ఉంటే ముందుగా శరచేయాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటిపన్ను వసూళ్లు చేయాలని వచ్చే జనవరి లోగా 100 శాతం పన్నులు వసూళ్లు చేయాలని తెలిపారు.
సి.సి.చార్జీలు, ట్రాక్టర్ నెలవారీ బ్యాంకు కిస్తీలు చెల్లించాలని అన్నారు. ఇంటింటి చెత్త సేకరణ ద్వారా కంపోస్టు ఎరువును తయారు చేయాలని, అట్టి ఎరువును అవసరం మేరకు వినియోగించుకొని , మిగతాది విక్రయించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు, లే అవుట్ అనుమతులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇవ్వాలని, 45 దరఖాస్తులు పెండిరగులో ఉన్నాయని, వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని అన్నారు. వణమహోత్సవం కార్యక్రమం క్రింద బ్యాగ్ ఫిల్లింగ్ పనులు పూర్తిచేసి, విత్తనాలు నాటాలని తెలిపారు.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద జాబ్ కార్డు కలిగిన ప్రతీ ఒక్కరికీ పనులు కల్పించాలని, లేబర్ మొబైలైజేషన్ చేయాలని అన్నారు. వంద రోజుల పనిదినాలు కల్పించాలని తెలిపారు. మహిళా శక్తి కార్యక్రమం క్రింద బ్యాంక్ లింకేజీ, స్త్రీ నిధి క్రింద ఋణాలు మంజూరు చేయడం, తీసుకున్న రుణాలను వసూళ్లు చేయాలని తెలిపారు. మహిళా శక్తి క్యాంటీన్ లు ఏర్పాటు చేయాలని అన్నారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనం లను పరిశీలించి మొక్కల ఎదుగుదలకు వాటరింగ్ చేయాలని తెలిపారు.
సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ సీఈవో చందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, మిషన్ భగీరథ, గృహ నిర్మాణం, ఎంపిడిఒలు, ఎంపీఒలు, గ్రామీణాభివృద్ధి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.