నిజామాబాద్, డిసెంబరు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది, మానవహక్కుల నేత గొర్రెపాటి మాధవరావు(67) హృదయ సంబందిత అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు.శుక్రవారం మధ్యాహ్నం గుండెలో సమస్య తలెత్తడంతో ఆయన బందువులు నిజామాబాద్ నగరంలోని ప్రగతి ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు వైద్యం అందించిన శరీరం సహకరించకపోడంతో తుదిశ్వాస విడిచారు.ఆయనకు ఇద్దరు కుమార్తెలు మానస, ఆదిత్య మధుమిత్, భార్య మీనా సహాని ఉన్నారు. ఆయన మరణ వార్త విన్న ప్రజా సంఘాల నేతలు పలువురు గొర్రెపాటి పార్ధీవశరీరానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా గురునాథ్ పాలెం గ్రామంలో 4 మార్చి,1957 లో జన్మించారు. ఆయనకు మూడు నెలల వయసు ఉన్నప్పుడే ఆయన తల్లిదండ్రులు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం అడకాస్ పల్లి వచ్చి స్థిరపడ్డారు.ఎత్తోండా గ్రామములో 7 వ తరగతి వరకు చదివిన అనంతరం కోటగిరి, బీర్కూర్ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలలో చదివి పదవ తరగతి ఉత్తీర్ణులైన పిదప బాన్సువాడలో ఇంటర్ పూర్తి చేశారు.
హైదరాబాద్ సిటీ కాలేజ్ లో డిగ్రీ చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో న్యాయశాస్త్ర పట్టభద్రులైన అనంతరం 21 జనవరి,1982 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని నిజామాబాద్ జిల్లాలో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. విద్యార్థి దశలోనే విప్లరాజకీయపట్ల ఆకర్షితుడై ఎమ్ ఎల్ పార్టీలో క్రీయాశీలక పాత్ర పోషించారు. ప్రగతిశీల విద్యార్థి సంఘం నిర్మాణంలో తమవంతు కృషి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంగంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గా విధులు నిర్వహించారు.కన్నభిరాన్, బాలగోపాల్ ల సాంగత్యంలో మానవ హక్కుల వేదిక స్థాపకుడిలలో ఒకరయ్యారు.
మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఐక్యరాజ్యసమితి విశ్వమానవ హక్కుల పత్రాన్ని తెలుగులోకి అనువదించారు.కార్మిక చట్టాలు, గతితార్కిక భౌతికవాదం,చైనా విప్లవం పుస్తకాలు రచించారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలలో పోలీసులకు పౌరహక్కులు, మానవహక్కుల గూర్చి ఉద్భోదించారు. నిజామాబాద్ నగరంలో జరిగిన రెండు బూటకపు పోలీస్ ఎంకౌంటర్‌లలో మృతి చెందిన యువకుల బంధువుల తరపున కోర్టులో నష్టపరిహార దావాలు వేసి గెలిచారు. చివరి శ్వాసవరకు మానవ హక్కుల కోసం తపించారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ గొర్రెపాటి పార్ధీవశరీరానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.