నిజామాబాద్, డిసెంబరు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇంటర్ విద్య లో ప్రతిష్టవంతమైన ప్రణాళికతో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు ఇంటర్ బోర్డు 90 రోజుల ప్రణాళికను తీసుకొచ్చిందని నిజామాబాద్ జిల్లాకు ఇంటర్ బోర్డు నియమించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి ఒడ్డెన్న (హైదరాబాద్ జిల్లా ఇంటర్ విద్య అధికారి, స్పెషల్ ఆఫీసర్) అన్నారు. నిజామాబాద్ జిల్లాలో శనివారం పలు కళాశాలలను తనిఖీ చేసి ఆయన సమీక్షించారు.
ఉదయం నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో, మధ్యాహ్నం డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒడ్డెన్న తనిఖీ చేసి సమీక్షించారు. నిజామాబాద్ ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ తోపాటు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ బుద్దిరాజ్, చంద్ర విట్టల్ ఆయా కళాశాలల అధ్యాపకులు సమీక్ష సమావేశాలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని సబ్జెక్టుల అధ్యాపకులు తమ వ్యక్తిగత ఫలితాలను మాత్రమే ఇప్పటివరకు చూసుకుంటున్నారని, దీనివల్ల గ్రూపు ఉత్తీర్ణత శాతం, కళాశాల ఉత్తీర్ణత శాతం తగ్గుతోందని, ఇక ముందు తమ గ్రూపులకు సంబంధించిన ఇతర సబ్జెక్టుల అధ్యాపకులతో విద్య బోధన లో సమన్వయం చేసుకుంటూ ప్రతి విద్యార్థి పై వ్యక్తిగత శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు. ఆయా గ్రూపులలో నిర్దేశించిన మేరకు విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గితే ఇంటర్ బోర్డు అధ్యాపకుల పై చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
అధ్యాపకుల బోధన తీరు తో పాటు, కళాశాలకు హాజరవుతున్న విద్యార్థుల కు ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల మార్కుల వివరాల నమోదు, వచ్చే మార్చి నెలలో నిర్వహించే వార్షిక పరీక్షలలో సాధించాల్సిన వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఆయన దిశా, నిర్దేశం చేశారు. ఇక పై అధ్యాపకులు సమన్వయంతో ముందుకు వెళ్ళనట్లయితే ఇంటర్ బోర్డు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు. ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య పర్యవేక్షణలో ప్రత్యేక అధికారులను నియమించి చదువులో వెనుకబడిన, కళాశాలకు రెగ్యులర్గా రాని విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడంతోపాటు వారినీ అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులుగా తయారు చేసేందుకు 90 రోజుల ప్రణాళికను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారనీ ఒడ్డేన్న అన్నారు.
ఈ సందర్భంగా అధ్యాపకుల పనితీరును ఆయన సమీక్షించి, అంచనా వేశారు. కళాశాలకు రాని విద్యార్థులను కచ్చితంగా రప్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచనలు, సలహాలు చేశారు. పరీక్షలకు విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయడంతో పాటు వారి భవిష్యత్తు అధ్యాపకుల చేతిలో ఉందని గమనించాలని అన్నారు. ప్రభుత్వ కళాశాలలకు వస్తున్న పేద, మధ్య తరగతి, వెనకబడిన తరగతుల కులాల, మైనారిటీ వర్గాల విద్యార్థులను జాగరుకుతతో గమనిస్తూ, వారి స్థితిగతులను, పరిస్థితులను అంచనా వేస్తూ సబ్జెక్టులను బోధించెందుకు శ్రద్ధ వహించాలనీ ఆదేశించారు. చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి ఉదయం, సాయంత్రం ప్రతి అధ్యాపకుడు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ఆదేశించారు. ఈ విషయంపై ఆయా కళాశాలల ప్రిన్సిపాల్‌లు ఖచ్చితంగా వ్యవహరించాలన్నారు.
జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ మాట్లాడుతూ ఇదివరకే 90 రోజుల ప్రణాళికపై అన్ని కళాశాల అధ్యాపకులతో ప్రిన్సిపాల్ లతో సమావేశాలు నిర్వహించమని, అయినప్పటికీ పరిస్థితులలో మార్పులు రాకపోతే ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పిస్తానని హెచ్చరించారు.
వచ్చే ప్రయోగ పరీక్షలను, వార్షిక పరీక్షలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధ్యాపకులు విద్య బోధన పై శ్రద్ధ వహించాలని అన్నారు. వచ్చే ప్రీ ఫైనల్ పరీక్షల నాటికి ప్రతి విద్యార్థికి తాము ఉత్తీర్ణులవుతామన్న భరోసాను కల్పించేందుకు అధ్యాపకులు కృషి చేయాలని అన్నారు. సమావేశంలో ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు.