కామారెడ్డి, డిసెంబరు 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇందిరమ్మ ఇండ్ల సర్వే వేగవంతం చేయాలనీ, పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో తక్కువ పనితీరు కనబరచిన మండల ప్రత్యేక అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల సర్వే పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సర్వే వేగవంతంతో పాటు నాణ్యత కలిగి ఉండాలని అన్నారు.
గ్రామ పంచాయతీ వారీగా పనితీరును మెరుగు పరచి త్వరగా సర్వే పూర్తి చేయాలనీ తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలనలు చేయాలని, తక్కువ పనితీరు కనబరచిన ప్రాంతాల్లో ఫోకస్ చేయాలని సూచించారు. కామారెడ్డి, బిచ్కుంద, నాగిరెడ్డి పేట్, నసురుల్లబాద్, పిట్లం, జుక్కల్, రామారెడ్డి, భిక్నూర్ మండలాల్లో తక్కువ శాతం ఇండ్ల సర్వే జరిగిందని, ఆయా మండలాల్లో వేగంగా పూర్తిచేయాలని అన్నారు.
సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిణి రజిత, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.