నందిపేట్, డిసెంబరు 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నందిపేట మండల కేంద్రంలో శ్రీరామ్ నగర్ కాలనీలో ఆదివారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో అయిదు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారని నందిపేట్ ఎస్ ఐ చిరంజీవి తెలిపారు. దొంగలు జుడా చర్చి వద్ద ఇసుక కొండయ్య, మేక వెంకటేష్, పేదూరు భూమేశ్వర్, విఆర్‌ఓ రాజేశ్వర్, బైండ్ల నారాయణ ఇళ్లలో తాళాలు పగలగొట్టి చోరీ కి పాల్పడ్డారని ఆయన చెప్పారు.
ఇసుక కొండన్న ఇంట్లో మూడు గంటల ప్రాంతంలో ఇద్దరు దొంగలు తాళం పగలగొట్టి బయటకెళ్ళిన సిసి ఫుటేజ్ కనపడగా దాదాపు అదే సమయంలో 2-10 నిమిషాల నుండి 3 గంటల 29 నిమిషాల వరకు వీఆర్వో రాజేశ్వర్ ఇంట్లో, పక్కనే గల పేదూరి భూమేశ్వర్ ఇంట్లో కి వెళ్లినట్లు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. ఇసుక కొండయ్య ఇంట్లో 3 తులాల బంగారం 6000 రూపాయలు వరకు చోరీ అయ్యాయని, మిగతా నాలుగు ఇళ్లలో ఏమీ దొరకకపోయేసరికి వస్తువులను చిందరవందర చేసి వెళ్లిపోయారని ఎస్ఐ చిరంజీవి తెలిపారు.
దాదాపు ఒకే సమయంలో రెండు ఇండ్లలో చోరీ అయినట్టు అనుమానం ఉందని, రెండు బ్యాచ్లుగా దొంగతనం చేసి ఉండొచ్చని, క్లూస్ టీం వారు ఆధారాలు సేకరిస్తున్నారని, బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామని తెలిపారు. అలాగే ప్రజలు ఎవరైనా బయట ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తమ ఇంటి వివరాలను పోలీస్ స్టేషన్లో తెలిపి వెళితే ఆ ఏరియాలో గస్తీ నిర్వహించేందుకు వీలుగా ఉంటుందని, తాళం వేసిన ఇళ్లను దొంగలు ముందుగా టార్గెట్ చేస్తారని, ఇంట్లో విలువైన వస్తువులు పెట్టి బయటకు వెళ్లకూడదని ఆయన తెలిపారు.