నిజామాబాద్, డిసెంబరు 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ది చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న మొబైల్ యాప్ సర్వేను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించారు. మోపాల్ మండల కేంద్రంతో పాటు కులాస్ పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు.
కలెక్టర్ స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సొంత స్థలం కలిగి ఉన్నారా, ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి యజమాని ఎవరు, పాత పెంకుటింట్లో ఉంటున్నారా లేక పక్కా గృహమా, నివేశన స్థలానికి సంబంధించి ఏమైనా ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయా? తదితర అంశాలను పరిశీలిస్తూ మొబైల్ యాప్లో వివరాలు నమోదు చేయించారు. ఇప్పటివరకు ఎంత మంది దరఖాస్తుదారుల వివరాలను సర్వే యాప్లో అప్లోడ్ చేశారు, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయని వివరాలు ఆరా తీశారు.
దరఖాస్తుదారుల వృత్తికి సంబంధించి యాప్ లో కొత్తగా చేర్చిన అప్షన్లు వస్తున్నాయా? సర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు దృష్టికి వచ్చాయా అని అడిగి తెలుసుకున్నారు. పురాతన, శిథిలావస్థకు చేరిన పాతకాలం నాటి ఇళ్లలో నివాసం ఉంటున్న వారు ఎవరైనా వాటి స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించుకునేందుకు ముందుకు వస్తే, అలాంటి వారి వివరాలను కూడా సర్వే యాప్ లో పొందుపర్చాలని అన్నారు.
అర్హత కలిగిన కుటుంబాలకు ప్రభుత్వపరంగా లబ్ది చేకూరేందుకు వీలుగా జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలని, సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట మోపాల్ తహశీల్దార్ రామేశ్వర్, ఎంపీడీఓ మోహన్, ఎంపీఓ కిరణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి హన్మాన్ రాజ్ తదితరులు ఉన్నారు.