కామారెడ్డి, జనవరి 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నూతన సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగుల సమిష్టి కృషితో జిల్లాకు మంచిపేరు ఘటించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. నూతన సంవత్సర సందర్భంగా విషెస్ తెలిపే కార్యక్రమాన్ని గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, జిల్లాను అన్ని రంగాల్లో ప్రప్రథమంగా నిలిపేందుకు ఉద్యోగులు సమిష్టి కృషి చేయాలని అన్నారు.
గత 2024 సంవత్సరంలో ఉద్యోగుల సహకారంతో మంచిపేరు సంపాదించామని, అదే స్ఫూర్తితో కొత్త సంవత్సరంలో ప్రతిభను సంపాదించాలని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు పరుచుటలో ప్రతీ ఉద్యోగి భాగస్వాములు కావాలని అన్నారు. దాదాపు ఒక వెయ్యి కోట్ల రూపాయలతో వరి ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే రెండవ స్థానం నిలిచ్చామని, రబీలో కూడా వరి సేకరించి ప్రధమంలో నిలవాలని అన్నారు. సన్న వరి కొనుగోళ్లలో క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ చెల్లించి 50 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించామని అన్నారు.
గత సంవత్సరం అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులు చేపట్టి నాణ్యమైన వసతి సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించామని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల్లో డైట్ చార్జీలు ప్రభుత్వం పెంచిందని, అట్టి చర్యల వలన విద్యార్థులకు నాణ్యమైన శుభ్రమైన రుచికరమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు క్షేత్ర పర్యటనలో వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు తనిఖీ చేయాలని అన్నారు.
అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలను పరిశీలించాలని తెలిపారు. అదనపు కలెక్టర్(రెవిన్యూ) వి.విక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, రానున్న ఎన్నికల్లో, పథకాల అమలులో త్రికరణ శుద్ధిగా పనిచేయాలని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను అమలు పరచాలని అన్నారు.
కలెక్టర్ నేతృత్వంలో ఉద్యోగులు సమిష్టి బాధ్యతతో పనిచేయాలని తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్స్ పర్యవేక్షణ బాధ్యతను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందనీ గుర్తు చేసారు. ఇంటింటి సమగ్ర సర్వే నిర్వహించామని, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు సందర్భంగా రవాణా శాఖ వారిచే తయారు చేసిన పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు.
అనంతరం అధికారులు, ఉద్యోగులు కలెక్టర్, అదనపు కలెక్టర్లకు నోట్ పుస్తకాలు, పెన్నులు, బ్లాంకెట్ లు అందజేసి నూతన సంవత్సర శుభకాంక్షలు తెలియజేసారు. కార్యక్రమంలో సిపిఒ రాజారాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, జిల్లా రవాణా శాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులు, తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.