నిజామాబాద్, జనవరి 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎస్సీ ఉపవర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం బహిరంగ విచారణకు విచ్చేసిన రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ గురువారం సాయంత్రం ముప్కాల్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీని సందర్శించారు.
స్థానికులను కలిసి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు, ఇతర రంగాలలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారు, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, విదేశాలలో ఉన్నత విద్య కోసం ఓవర్సీస్ పథకం ద్వారా ఎవరైనా లబ్ది పొందారా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తున్న కుటుంబాలు ఎన్ని, బీడీ కార్మికులకు పెన్షన్ అందుతోందా తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.
షెడ్యూల్డ్ కులానికి చెందిన వివిధ వర్గాల వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులను పరిశీలించి, ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో అన్ని అంశాలను పొందుపరుస్తామని ఏకసభ్య కమిషన్ జస్టిస్ షమీమ్ అక్తర్ తెలిపారు. ఆయన వెంట షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ అదనపు సంచాలకులు శ్రీధర్, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, డీ.ఎస్.సీ.డీ.ఓ నిర్మల తదితరులు ఉన్నారు.