నిజాం షుగర్స్‌ పునరుద్ధరణకు ప్రభుత్వం సానుకూలం

నిజామాబాద్‌, జనవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

చెరకు రైతుల చిరకాల వాంఛ అయిన నిజాం చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఎమ్మెల్యేలు సుదర్శన్‌ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్‌ భూపతి రెడ్డి, షుగర్‌ కేన్‌ కమిషనర్‌ మల్సూర్‌ వెల్లడిరచారు. నిజాం షుగర్స్‌ ను పునః ప్రారంభించే చర్యల్లో భాగంగా శనివారం నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి శివారులోని సరయు ఫంక్షన్‌ హాల్‌లో స్థానిక శాసన సభ్యులు సుదర్శన్‌ రెడ్డి నేతృత్వంలో ఫ్యాక్టరీ పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన చెరకు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, మాజీమంత్రి మండవ వెంకటేశ్వర రావు తదితరులు సదస్సులో భాగస్వాములయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ, రైతులు చెరకు సాగుకు ముందుకు వస్తే ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని భరోసా కల్పించారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీని పునరుద్ధరింపజేసేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నామని అన్నారు. ఈ ప్రాంత రైతుల ప్రయోజనాల కోసం నిజాం షుగర్స్‌ ను తెరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రికి సూచించగా, సీఎం సానుకూల వైఖరితో అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

ఇందులో భాగంగానే ఫ్యాక్టరీకి సంబంధించి పెండిరగ్‌ ఉన్న సుమారు 190 కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. చెరకు పంట సాగుకు రైతులు సంసిద్ధత తెలిపితే, కర్మాగారాన్ని తెరిపించి నిజాం షుగర్స్‌ కు పూర్వ వైభవం చేకూరుస్తామని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని స్పష్టం చేశారు. చెరకు ఫ్యాక్టరీకి అనుబంధంగా ఉన్న డిస్టిల్లరీ యూనిట్‌ ను కూడా తెరిపించాలని ధృడ సంకల్పంతో ముందుకెళ్తున్నామని ఎమ్మెల్యే వెల్లడిరచారు. ఇప్పటికే ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేసేందుకు ఎన్ని నిధులు వెచ్చించాల్సి వస్తుందనే దానిపై అధికారులు ప్రాథమికంగా అంచనాలు రూపొందించారని తెలిపారు.

ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌ రావు మాట్లాడుతూ, రైతులు సంప్రదాయంగా వస్తున్న వరి పంటకు ప్రత్యామ్నాయంగా అధిక లాభాలను అందించే చెరకు పంటను సాగు చేయాలని సూచించారు. ఆధునిక యాంత్రీకరణ అందుబాటులోకి వచ్చి సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించుకునే వెసులుబాటు ఉందని, అధిక దిగుబడులను అందించే వంగడాలను విత్తుకుని సరైన యాజమాన్య పద్దతులను పాటిస్తే ముమ్మాటికీ చెరుకు లాభసాటి పంట అని అన్నారు.

షుగర్‌ కేన్‌ కమిషనర్‌ మల్సూర్‌ మాట్లాడుతూ, రైతుల కోరిక మేరకు నిజాం షుగర్స్‌ పునరుద్ధరణకు సంబంధించి ప్రభుత్వం సానుకూల వైఖరితో ముందుకెళ్తోందని అన్నారు. ఈ దిశగా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కూడిన కమిటీని నియమించగా, ఇటీవలే కమిటీ క్షేత్రస్థాయి సందర్శన జరిపిందని గుర్తు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం సుమారు 190 కోట్ల రూపాయల బకాయిలను కూడా చెల్లించిందని అన్నారు. అయితే కనీసం 16 వేల నుండి 18 వేల ఎకరాల విస్తీర్ణంలో చెరకు పంటను సాగు చేస్తే ఫ్యాక్టరీలో క్రషింగ్‌ జరపవచ్చని సూచించారు.

చెరకు సాగుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వం తరపున సబ్సిడీపై విత్తనాలను సమకూర్చడంతో పాటు అన్ని విధాలుగా తోడ్పడును అందిస్తామని అన్నారు. ఫ్యాక్టరీ పరిధిలోని ఆయా గ్రామాల రైతుల నుండి చెరకు పంట సాగు చేసే విషయమై అభిప్రాయాలను సేకరించి, స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, చెరకు పంట సాగు పై రైతుల అభిప్రాయాలను తెలుసుకుని, ప్రభుత్వం నుండి వారు ఏమి ఆశిస్తున్నారనే విషయాలను తెలుసుకునేందుకు వీలుగా ఈ సదస్సు నిర్వహించడం జరిగిందని అన్నారు.

కాగా, ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలతో పాటు సకాలంలో బిల్లుల చెల్లింపులపై స్పష్టమైన హామీ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం అందించే ఇన్సెంటివ్‌ కు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్రోత్సాహకాన్ని జోడిరచి ఇవ్వాలని, డ్రిప్‌ పరికరాలు, హార్వెస్టర్లు, సోలార్‌ ఫెన్సింగ్‌, ఇతర ఆధునిక యంత్ర పరికరాలకు సబ్సిడీని వర్తింపజేయాలని ఈ సందర్భంగా రైతులు కోరారు.

సదస్సులో ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌, వ్యవసాయ కమిషన్‌ సభ్యులు గడుగు గంగాధర్‌, సహకార యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌ రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్‌ రమేష్‌ రెడ్డి, ఐడీసీఎంఎస్‌ చైర్మన్‌ తారాచంద్‌ నాయక్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో, సంబంధిత శాఖల అధికారులు, అధిక సంఖ్యలో చెరకు రైతులు పాల్గొన్నారు.

Check Also

బిసి డిక్లరేషన్‌ను అమలు చేయాలి

Print 🖨 PDF 📄 eBook 📱 ఆర్మూర్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనసభ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »