నిజామాబాద్, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామబాద్ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగ అప్ గ్రేడ్ చేయాలని పి.డి.యస్.యు. విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కళాశాల నుండి కంటేశ్వర్ చౌరస్తా వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.యస్.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేట్ చేయాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్యూ విద్యార్థు సంఘం ఆధ్వర్యంలో అనేక దఫాలుగా ఆందోళనలు చేయడం జరిగిందని తెలిపారు.
ప్రభుత్వ సలహాదారులైన షబ్బీర్ అలీ గారిని, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిని, జిల్లా అధికారులను కలవడం జరిగిందని, అదే సందర్భంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాల గా అప్ గ్రేడ్ చేస్తామని మంత్రివర్గం కూడా హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇంజనీరింగ్ కాలేజీ నిజామబాద్ జిల్లాకు కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.
కానీ ఇప్పటివరకు ఇంజనీరింగ్ కళాశాల గా అప్ గ్రేడ్ చేస్తున్నామని జీవో జారీ చేయకపోవడం అన్యాయమన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కూడా నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల కావాలని ఏ ఒక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అడగకపోవడం, స్థబ్దంగా ఉండడం బాధాకరమన్నారు. వెంటనే నిజామాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో పి.డి.యస్.యు. నగర నాయకులు నసీర్, నాగేష్, శ్రీకాంత్, లక్ష్మణ్, తరుణ్, అఖిల్,ఆశిష్, నిఖిల్ లతో కళాశాల కమిటీ నాయకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.