కామారెడ్డి, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు.
శనివారం రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ నుంచి రోడ్లు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తో కలిసి రోడ్డు భద్రత మాసోత్సవాల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గతంలో కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించేదని, దీని ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని నేడు రోడ్డు భద్రతా మాసోత్సవం చేపడుతుందని అన్నారు. కార్యక్రమంలో ప్రతి శాఖను భాగస్వామ్యం చేస్తూ విస్తృతంగా ప్రజలకు చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
రోడ్డు భద్రత ప్రమాణాల పై వేడుకలను ప్రతి గ్రామంలో జరగాలని అన్నారు. పిల్లల్లో రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించేందుకు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత విద్యార్థులచే ప్రతి జిల్లా , మండల హెడ్ క్వార్టర్ లో భారీ ర్యాలీ చేపట్టాలని అన్నారు.
ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖ తమ పరిధిలో రోడ్డు భద్రతా ప్రమాణాల కార్యక్రమాలు జరగాలని అన్నారు. రవాణా శాఖ, పోలీస్ శాఖ, విద్యాశాఖ, రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు భద్రత కార్యక్రమాలు విజయవంతం చేయాలని అన్నారు.
భారీ తుఫాన్లు, వరదలు, రోగాల వల్ల పోయే ప్రాణాల కంటే ప్రమాదంలో అధికంగా ప్రాణాలు కోల్పోతున్నామని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు మనమంతా కలిసి పని చేయాలని అన్నారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను పిల్లల పాఠ్యాంశం లో కూడా పెట్టెలా చూస్తామని అన్నారు.
రోడ్డు భద్రత నియమాలను పాటించని వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసి భవిష్యత్తులో జారీ చేసేందుకు వీలు లేకుండా సాఫ్ట్వేర్ రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని అన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాల కార్యక్రమాలకు విస్తృత ప్రచారం ఉండాలని, స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అన్నారు.
రోడ్డు భద్రత ప్రమాణాల అవగాహన కార్యక్రమాల్లో హెల్మెట్ వినియోగం వల్ల కలిగే లాభాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ వినియోగించేలా ప్రోత్సహిస్తూ కొంతమందికి హెల్మెట్ పంపిణీ చేయాలని, ఈ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.
మహిళల ప్రయాణికుల సంఖ్య పెరిగిన మార్గాలలో బస్సులు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. రవాణా శాఖ అధికారులు రోడ్డు భద్రతా కార్యక్రమాలను ముందుండి నిర్వహించాలని, పాఠశాలలో రోడ్డు భద్రత ప్రమాణాలపై పోటీ పరీక్షలు నిర్వహించాలని అన్నారు.
రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లలకు మెస్ చార్జీలు పెంచామని, వారికి రుచికరమైన నాణ్యమైన ఆహారం అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. పిల్లలకు అందించే ఆహార పదార్థాల నాణ్యతను కలెక్టర్లు, ఉన్నతాధికారులు తనిఖీ చేయాలని, నిత్యావసర సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు త్వరగా చెల్లిస్తున్నామని, నాణ్యత అంశంలో ఎక్కడ రాజీ ఉండవద్దని అన్నారు.
రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ మాట్లాడుతూ, జనవరి నెల మొత్తం రోడ్డు భద్రత ప్రమాణాల కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు తెలిపారు. ప్రస్తుత సమాజంలో జరిగే రోడ్డు ప్రమాదాలలో 75 శాతం డ్రైవర్ తప్పుల వల్ల జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలు, పాటించాల్సిన నియమ నిబంధనల పై అవగాహన కల్పించాలని అన్నారు.
రోడ్ల పై ప్రమాదాలు జరిగినప్పుడు అంబులెన్స్ ఏ ఆసుపత్రికి తీసుకుని రావాలి ఒక ప్రణాళిక ఉండాలని, దీని పై అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రతి జిల్లా స్థాయిలో ఉన్న రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించి, ఆక్సిడెంట్ ప్రోన్ ఏరియా గుర్తించాలని, అక్కడ అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు.
ప్రతి పాఠశాల పరిసరాలలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు చిన్నతనం నుంచి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన ఉండాలని అన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాలపై లోకల్ ఎఫ్.ఎం రేడియో, కేబుల్ చానల్స్ లో టెలికాస్ట్ అయ్యేలా చూడాలని అన్నారు.
రోడ్లు భవనాల శాఖ, పంచాయతీ రోడ్లు, జాతీయ రహదారుల్లో అవసరమైన సైన్ బోర్డులు ఉండేలా జిల్లా రవాణా శాఖ అధికారి పర్యవేక్షించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా విస్తృతంగా జిల్లా ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు,రంగోలి, వ్యాస రచన పోటీలు నిర్వహించాలని అన్నారు. జిల్లాలో తెలంగాణ సాంస్కృతిక సారధుల చే గ్రామ గ్రామాన పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే బాధితులను అంబులెన్స్ లో ఏ ఆసుపత్రికి తీసుకవెళ్లలో తెలిపే విధంగా ఆసుపత్రుల వివరాల బోర్డులు ఏర్పాటుచేయాలని సూచించారు.
జిల్లాలో బ్లాక్ స్పాట్ లను గుర్తించి ఆయా ప్రాంతాల్లోని హాస్పిటల్ లో వైద్య సౌకర్యాలు ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలనీ తెలిపారు. జాతీయ రహదార్లు, ఆర్.టీ.సి. లలో కంటి పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ప్రమాదాల నివారణకు ప్రతీ ఒక్కరు హెల్మెట్ ధరించే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల వద్ద ట్రాఫిక్ రూల్స్ తెలిపే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటుచేయాలని తెలిపారు.
సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, జిల్లా రవాణా శాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చంద్రశేఖర్, జిల్లా విద్యా శాఖాధికారి రాజు, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.