నిజామాబాద్, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి రోడ్లు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తో కలిసి రోడ్డు భద్రత మాసోత్సవాల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రోడ్డు భద్రతా మాసోత్సవం ప్రాధాన్యతను గుర్తిస్తూ, ఈ కార్యక్రమంలో ప్రతి శాఖను భాగస్వామ్యం చేస్తూ ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ప్రతి గ్రామంలో రోడ్డు భద్రత ప్రమాణాల పై వేడుకలను నిర్వహించాలని, విద్యార్థులు, చిన్నారులలో రోడ్డు భద్రతా ప్రమాణాల పై అవగాహన కల్పించేందుకు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత విద్యార్థులచే ప్రతి జిల్లా, మండల కేంద్రాలలో ర్యాలీలు చేపట్టాలని అన్నారు.
రవాణా, పోలీస్, విద్యాశాఖలు, రోడ్లు – భవనాలు, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు భద్రత కార్యక్రమాలను విజయవంతం చేయాలని అన్నారు. భారీ తుపాన్లు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, ప్రాణాంతక వ్యాధులతో పోలిస్తే రోడ్డు ప్రమాదాల కారణంగా అత్యధికంగా ప్రాణనష్టం సంభవిస్తుందని ఆందోళన వెలిబుచ్చారు. ఎంతో విలువైన ప్రాణాలను కాపాడుకునేందుకు గాను రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతా ప్రమాణాల ఆవశ్యకత గురించి పాఠ్యాంశాల్లో పొందుపర్చేలా చూస్తామని అన్నారు.
రోడ్డు భద్రత నియమాలను పాటించని వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసి భవిష్యత్తులో మళ్ళీ జారీ చేసేందుకు వీలు లేకుండా సాఫ్ట్వేర్ రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాల అవగాహన కార్యక్రమాల్లో హెల్మెట్ వినియోగం వల్ల కలిగే లాభాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ వినియోగించేలా ప్రోత్సహిస్తూ కొంతమందికి హెల్మెట్ పంపిణీ చేయాలని, ఈ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.
మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిన మార్గాలలో బస్సుల సంఖ్య పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కాగా, రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లలకు మెస్ చార్జీలు పెంచామని, వారికి రుచికరమైన నాణ్యమైన ఆహారం అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. పిల్లలకు అందించే ఆహార పదార్థాల నాణ్యతను కలెక్టర్లు , ఉన్నతాధికారులు తనిఖీ చేయాలని, నిత్యావసర సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు త్వరగా చెల్లిస్తున్నామని, నాణ్యత అంశంలో ఎక్కడ రాజీ ఉండవద్దని అన్నారు.
వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, డీటీసీ దుర్గప్రమీలా, బీసీ సంక్షేమ శాఖ అధికారిణి స్రవంతి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.