కామారెడ్డి, జనవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇందిరా మహిళా శక్తి (ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం) పథకం క్రింద మంజూరు అయిన యూనిట్ స్థాపించి ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో సంచార చేపల అమ్మకం వాహనాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరా మహిళా శక్తి పథకం క్రింద 10 లక్షల రూపాయలతో సంచార చేపల అమ్మకం వాహనం గాంధారి మండలం స్వయం సహాయక సంఘ సభ్యురాలు తేజావత్ లతకు మంజూరు చేయడం జరిగిందని, ఇందులో 4 లక్షలు సభ్యురాలు వాటా కాగా, 6 లక్షలు సబ్సిడీ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
సంచార చేపల అమ్మకం వ్యాపారం నిమిత్తం నితం శిక్షణ లో 5 రోజుల పాటు సభ్యురాలికి శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ వ్యాపారంలో మంచి రుచి గల కొత్త
వంటకాలు తయారు చేసి వ్యాపారం చేయాలని తెలిపారు. చేపల సరఫరాకోసం మత్స్య శాఖాధికారులు సహకారం పొందాలని, చేపల సరఫరా చేసే వారితో టై అప్ చేసుకోవాలని తెలిపారు.
ఈ సందర్భంగా లబ్ధిదారురాలు తేజావాత్ లత మాట్లాడుతూ, ఇంటిలో తయారు చేసే వంటకాల మాదిరిగా రసాయనాలు లేని వంటకాలు తయారు చేసి అమ్మకాలు చేపడతామని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో అమ్మకాలు జరుపెవిధంగా సంచార వాహనాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. వ్యాపారంలో రాణించి మరికొందరికి ఆదర్శంగా నిలుస్తామని తెలిపారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా మత్స్య శాఖాధికారి శ్రీపతి, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి వృద్ధి అధికారి మురళీ కృష్ణ, గాంధారి మండల సమైఖ్య అధ్యక్షురాలు పుష్పరాణి, మహిళా సభ్యురాల్లు, ఎపిఎం, తదితరులు పాల్గొన్నారు.