ఆర్మూర్, జనవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
శాసనసభ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయాలని బిజెపి ఓబీసీ జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి 28 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్ ను 42 శాతం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి విస్మరించారన్నారు. బీసీ కమిషన్ కు తాను కలిసి జనాభా ధమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరినట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్ లో రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించి మోసం చేశారన్నారు.
ఈ లెక్కన ఐదు సంవత్సరాలకు లక్ష కోట్లు బీసీలకు కేటాయించాల్సి ఉందన్నారు. బీసీలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేసినందున వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం నేర్పించాలన్నారు. 10 సంవత్సరాల కాలంలో బీసీల గురించి మాట్లాడని ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ కవితకు సోయి లేదా అని ప్రశ్నించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు జనాభా మేరకు రిజర్వేషన్లు ప్రకటించనట్లయితే ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. మంగళవారం అన్ని మండలాలలో బిజెపి ఓబీసీ తరఫున తహసిల్దార్లకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గద్దెనెక్కి మోసం చేస్తున్నారన్నారు. సమావేశంలో బిజెపి ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రచ్చ సుదర్శన్, బండారి దేగాం యాదగిరి, కౌన్సిలర్ ఆకుల శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు, ఓ బి సి నియోజకవర్గ కన్వీనర్ గంగోనే వినోద్, మండల అధ్యక్షుడు విగ్నేష్, పట్టణ అధ్యక్షుడు బాశెట్టి రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు పోహార్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.