కామరెడ్డి, జనవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
2023-24 సంవత్సరం రబీ కాలానికి సి.ఏం.ఆర్. త్వరగా సరఫరా చేయాలనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని రైస్ మిల్లర్ల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత సంవత్సరం రబీ కాలానికి సంబంధించిన సి.ఏం.ఆర్. (కస్టమ్ మిల్లింగ్ రైస్) లక్ష్యానికి అనుగుణంగా మిల్లర్లు సరఫరా చేయలేదని, ఈ నెల 25 లోగా నిర్ణయించిన కస్టమ్స్ మిల్లింగ్ రైస్ సరఫరా చేయని పక్షంలో సదరు రైస్ మిల్లుల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆయా రైస్ మిల్లులను తనిఖీ చేసి స్టాక్ లను పరిశీలించాలని తెలిపారు. సి.ఏం.ఆర్. త్వరితగతిన సరఫరా చేయాలని అన్నారు. గత ఖరీఫ్ లో సి.ఏం.ఆర్. సరఫరాలపై కలెక్టర్ వాకబు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయించిన తేదీ లోగా సి.ఏం.ఆర్. సరఫరా చేయని మిల్లర్లకు నోటీసులు జరీచేయడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు మిల్లర్లు సహకరించాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, మిల్లర్లు పాల్గొన్నారు.