బాన్సువాడ, జనవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం బాన్సువాడ మున్సిపల్ ప్రాంతంలో అమృత్ పథకం క్రింద 52 కోట్లతో మంచినీటి సరఫరా పనులకు భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 50 సంవత్సరాలకు సరిపడే త్రాగునీటి సౌకర్యాల పనులు చేపట్టడం అభినంద నీయమన్నారు. గడచిన 4 ఎండ్లలో ఒక వేయి కోట్ల రూపాయలతో నియోజక వర్గంలో పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు.
నియోజక వర్గంలో 175 కోట్లతో పెదాలకు 3500 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ శేట్కర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అమృత్ పథకం క్రింద 52 కోట్లతో త్రాగునీటి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతం వంద శాతం ఇరిగేషన్ ప్రాంతమని అన్నారు.
బాన్సువాడ నియోజక వర్గం శాసన సభ్యులు, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, బాన్సువాడ నియోజకవర్గంలో 70 వేలకు పైగా ఇళ్ల, మున్సిపల్ లో 8900 ఇళ్లు ఉన్నాయని ఆయా గృహాలకు సరిపడా త్రాగునీటి సౌకర్యాలకు గత స్కీమ్ ద్వారా ఉన్నప్పటికీ, పెరుగుతున్న జనాభా, అవసరాల దృష్ట్యా అమృత్ 2 పథకం క్రింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాబోయే తరాల వారికి నీటి ఎద్దడి సమస్యలు లేకుండా ఉండేందుకు పనులను చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికే ఉన్న నీటి ట్యాంకు లకు తోడు మరిన్ని ఎక్కువ సామర్థ్యం గల ట్యాంకుల నిర్మాణాలు చేపట్టనున్నామని తెలిపారు.
కోటగల్లి గుట్టమీద 18 లక్షలు లీటర్ల, ఇతర ప్రాంతాల్లో 8 లక్షలు,6 లక్షల, 2 లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకులను నిర్మించనున్నట్లు తెలిపారు. రాబోయే 50 సంవత్సరాల వరకు అవసరమయ్యే నీటి సౌకర్యాలను సమకూరుస్తున్నమని తెలిపారు. బాన్సువాడ నియోజక వర్గంలో సాగు, త్రాగు నీటి సమస్యలు తలెత్తకుండా పనులు చేపడుతున్నామని తెలిపారు. ఒకవేయి కోట్లతో ఇరిగేషన్ పనులు చేపట్టడం జరిగిందని వివరించారు. గరీబొల్లకి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని, త్వరలో ఆ ప్రక్రియ ప్రారంభం చేస్తామని తెలిపారు. ఇళ్ల స్థలాలు లేని పెదాలకు భూములు మంజూరు చేయాలని కోరారు.
అంతకు ముందు 40 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రోహిబిష్ అండ్ ఎక్సైజ్ కార్యాలయ నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. రోడ్డు సేఫ్టీ కార్యక్రమాల్లో భాగంగా ర్యాలీ ను మంత్రి ప్రారంభించారు.
కార్యక్రమాల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.