నిజామాబాద్, జనవరి 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాల కోసం విద్యార్థినీ విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాల కోసం ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 23న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనుందని తెలిపారు. గురుకులాల్లో విద్యను అభ్యసించదల్చిన బాలబాలికలు వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్ లో ఫిబ్రవరి 01వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
దరఖాస్తు చేసుకునేందుకు కుల ధ్రువీకరణ పత్రం నెంబరు, ఆదాయ ధ్రువీకరణ పత్రం నెంబరు, ఆధార్ కార్డు నెంబరు, బర్త్ సర్టిఫికెట్, ఫోటో అవసరమని తెలిపారు. పై ధ్రువీకరణ పత్రాల సత్వర జారీ కోసం కలెక్టరేట్లో సహాయ కేంద్రం ఏర్పాటు చేశామని, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రం తెరిచి ఉంటుందని అన్నారు.
2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6 నుండి 9 వ తరగతి వరకు ఖాళీ సీట్లలో ప్రవేశాల కోసం, గౌలిదొడ్డి లోని సాంఘిక సంక్షేమ గురుకులంలో 9వ తరగతిలో ప్రవేశాల కోసం, ఖమ్మం లోని గిరిజన సంక్షేమ గురుకులం, పరిగిలో ఎస్.ఓ.ఈలలో 8 వ తరగతిలో ప్రవేశాలకై, అలుగునూరులోని సి.ఓ.ఈలో 9 వ తరగతిలో అడ్మిషన్ల కోసం, రుక్మాపూర్ సైనిక్ స్కూల్, మల్కాజ్ గిరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ లో 6 వ తరగతిలో ప్రవేశాల కోసం ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా గడువులోపు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.
ఈ అవకాశాన్ని విద్యార్థిని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.