కామారెడ్డి, జనవరి 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించడానికి సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో పలు శాఖల అధికారులు, దివ్యాంగుల సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమావేశంలో సంఘాల ప్రతినిధులు లేవనెత్తిన అంశాలకు సంబంధించినవి పరిస్కరించడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
సదరం క్యాంప్ లకు హాజరైన దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్స్ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండు, నాలుగు సంవత్సరాల కాలానికి ఇచ్చే సదరం సర్టిఫికెట్స్ కు మీ సేవా ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి కలుగుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులకు లేఖలు రాస్తామని తెలిపారు. దివ్యాంగుల సమస్యలపై అర్జీలను ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో సమర్పించవచ్చనీ తెలిపారు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేకంగా సీట్ల కేటాయింపు విషయంలో డిపో మేనేజర్‌లతో చర్చించి చర్యలు తీసుకొంటామని తెలిపారు. దివ్యాంగులకు స్వయం సహాయక గ్రూప్ లు ఉన్నప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో నడిచే విధంగా చర్యలు తీసుకొని ఋణాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని ఆదేశించారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకం క్రింద 150 రోజుల పని దినాలు కల్పించాలని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో దివ్యాంగులకు పోస్టల్ శాఖ ద్వారా కాకుండా బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లించేందుకు పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులో 5 శాతం కేటాయించాలని కోరిన మేరకు చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సహకరిస్తామని తెలిపారు. రైల్వే పాసుల విషయంలో రైల్వే అథారిటీ వారికి లేఖలు రాస్తామని తెలిపారు. అలీంకో వారిచే క్యాంపులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చౌక ధరల దుకాణాల కేటాయింపులు ఆయా ఆర్డీఓ లతో మాట్లాడి చర్యలు చేపడతామని అన్నారు.
ప్రతీ కార్యాలయంలో ర్యాంపు నిర్మించే విధంగా ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. అంతకుముందు దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు పలు సమస్యలపై కలెక్టర్ కు వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిణి రజిత, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా విద్య శాఖాధికారి రాజు, ఎల్.డి.ఏం. రవికాంత్, జడ్పీ సీఈవో చందర్, పలు శాఖల అధికారులు, సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.