నిజామాబాద్, జనవరి 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయనుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ నుంచి ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రభుత్వం అమలులోకి తెస్తోందని అన్నారు. అర్హులైన కుటుంబాలకు రెండు విడతలలో రూ. 6 వేలు చొప్పున ప్రతీ సంవత్సరం రూ. 12,000 నేరుగా వారి ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు అయి ఉండి, 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పని చేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులని కలెక్టర్ స్పష్టం చేశారు. భూభారతి (ధరణి) పోర్టల్ ఆధారంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలను నిర్ధారించడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాలోని భూమి లేని అర్హత కలిగిన వ్యవసాయ కూలీ కుటుంబాలన్నింటికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ వివరించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత కలిగిన కుటుంబాలను గుర్తించేలా సంబంధిత అధికారులను ఆదేశించామని అన్నారు.
ప్రతి గ్రామ పంచాయతీలో ఈ నెల 21 నుండి 24వ తేదీ వరకు నిర్వహించే గ్రామసభలలో లబ్ధిదారుల ముసాయిదా జాబితాను చదివి వినిపించిన మీదట తుది జాబితాను ఆమోదించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఒకవేళ గ్రామ సభలో ఏవైనా అభ్యంతరాలు వచ్చినట్లైతే, సంబంధిత ఎంపీడీఓ వాటిని పరిశీలించి, నిర్ణీత గడువు లోపు పరిష్కరిస్తారని అన్నారు.