నిజామాబాద్, జనవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా సమగ్ర వివరాలను సేకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు, సర్వే బృందాలకు సూచించారు. సేకరించిన వివరాలను వెంటదివెంట తప్పులు లేకుండా క్రమపద్ధతిలో రిజిస్టర్లలో నమోదు చేసుకోవాలని, తద్వారా డేటా ఎంట్రీ సమయంలో పొరపాట్లకు అవకాశం ఉండదని అన్నారు.
సిరికొండ, ధర్పల్లి మండలాల్లోని ఆయా గ్రామాలలో కలెక్టర్ గురువారం విస్తృతంగా పర్యటిస్తూ, అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను నిర్వహిస్తున్న తీరును తనిఖీ చేశారు. పెద్దవాల్గోట్, సిరికొండ, మైలారం, దుబ్బాక, ధనంబండతండా తదితర గ్రామాలలో రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను నిశితంగా పరిశీలన జరిపారు. అర్హులైన లబ్ధిదారులను ఏ ప్రాతిపదికన గుర్తిస్తున్నారు, ఏయే అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు, సేకరించిన అంశాలను రిజిస్టర్లలో క్రమపద్ధతిలో నమోదు చేస్తున్నారా? లేదా అని తనిఖీ చేసిన కలెక్టర్, అధికారులకు కీలక సూచనలు చేశారు.

జిల్లా వ్యాప్తంగా ప్రతీ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఫీల్డ్ వెరిఫికేషన్ వేంగంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరిస్తూ సమగ్ర వివరాలను సేకరించాలని, ఆధార్ కార్డు, ప్రజాపాలన దరఖాస్తులు, సామాజిక ఆర్ధిక సర్వే వివరాలతో క్షేత్రస్థాయి పరిశీలన వివరాలను సరిచూసుకోవాలని అన్నారు. రైతు భరోసా పథకానికి సంబంధించి నలా కన్వర్షన్, భూసేకరణ, లే అవుట్, వ్యవసాయానికి యోగ్యంగా లేని భూములను సర్వే నెంబర్ల వారీగా పరిశీలించాలని, భూభారతి (ధరణి) పోర్టల్, గూగుల్ మ్యాప్ ల ఆధారంగా వాస్తవ వివరాలను నిర్ధారణ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
డిజిటల్ సంతకం ఉన్న పట్టా పాస్ బుక్కులకు సంబంధించి కూడా సదరు భూములలో పంటలు సాగు చేస్తున్నారా లేదా అన్నది క్రాప్ బుకింగ్ వివరాల ఆధారంగా పరిశీలన చేయాలన్నారు. వ్యాపార, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న భూములను క్షేత్రస్థాయిలో గుర్తించి పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని, వాటిని సంబంధిత పోర్టల్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని సూచించారు. కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులైన కుటుంబాలను గుర్తించిన సమయంలో, పాత కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు లేకుండా క్షుణ్ణంగా పరిశీలన జరపాలని అన్నారు.
రేషన్ కార్డులలో పేర్ల తొలగింపుతో పాటు కొత్త పేర్లను చేర్చడం వంటివి కూడా చేయాల్సి ఉన్నందున దరఖాస్తుదారుని కుటుంబంలోని సభ్యులందరి వివరాలను సేకరించాలని కలెక్టర్ తెలిపారు. ఎలాంటి గందరగోళం, తప్పిదాలకు ఆస్కారం లేకుండా క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను వేగవంతంగా చేపడుతూ, ఈ నెల 20వ తేదీ నాటికి అన్ని గ్రామాలలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఫీల్డ్ వెరిఫికేషన్ కు వెళ్ళడానికి ముందే ఆయా గ్రామాలలో చాటింపు ద్వారా ప్రజలకు ముందస్తు సమాచారం తెలియజేయాలని అన్నారు.
అర్హుల జాబితాల రూపకల్పనలో ఏవైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్న బృందాలకు సూచించారు. క్షేత్ర స్థాయి పరిశీలన బృందాల పనితీరును మండల స్థాయిలో తహసీల్దార్లు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, సిరికొండ మండల స్పెషల్ ఆఫీసర్ నాగూరావు, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, తహసీల్దార్ రవీందర్ తదితరులు ఉన్నారు.