నిజామాబాద్, జనవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఈ నెల 26 నుండి అమలులోకి తెస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. బుధవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి అదనపు కలెక్టర్లు, మండల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల జిల్లా అధికారులతో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా చూడాలన్నారు. లబ్ధిదారుల జాబితాను రూపొందించడంలో అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ నెల 16 నుండి 20వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి జాబితాను రూపొందించాలని ఆదేశించారు. ఈ నెల 21 నుండి చేపట్టనున్న గ్రామ సభలలో ఆ జాబితాను ప్రవేశపెట్టి, ఆమోదం పొందిన మీదట అర్హుల జాబితాను కలెక్టర్ కార్యాలయంలో అందించాలని సూచించారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద అర్హులైన కుటుంబానికి సంవత్సరానికి 12 వేల రూపాయలు, మొదటి విడతగా 6 వేల రూపాయలు అందించడం జరుగుతుందని, భూమిలేని నిరుపేదలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులపాటు పని దినాలు ఉన్న వారి వివరాలతో అర్హుల జాబితా రూపొందించాలని, ఉపాధి హామీ కూలీల ఆధార్ కార్డును అనుసంధానం చేయడం జరిగిందని తెలిపారు. రైతు భరోసా పథకానికి అర్హులైన వారి జాబితా తయారు చేయాలని, ఎట్టి పరిస్థితులలో సాగుకు యోగ్యం కానీ భూములు, గుట్టలు, నివాసాలు కలిగిన ఇతర భూములు, వెంచర్లు, భూ సేకరణ కింద తీసుకున్న సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు, రైల్వే లైన్, రహదారుల కోసం తీసుకున్న భూముల వివరాలు జాబితాలో ఉండకూడదని తెలిపారు.
సాగుకు యోగ్యంగా ఉండే భూముల వివరాలతో జాబితా తయారు చేయాలని, వ్యవసాయ అధికారులు రూపొందించిన జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుదారుల పూర్తి వివరాలను నమోదు చేయాలని, గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారి వార్షిక ఆదాయం లక్షా 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాలలో నివసించే వారికి 2 లక్షల రూపాయలకు మించి ఉండకూడదని తెలిపారు. రేషన్ కార్డులలో పేర్ల తొలగింపులు, కొత్త పేర్లను చేర్చడం వంటివి కూడా చేయాల్సి ఉంటుందని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియ జిల్లాలో దాదాపుగా పూర్తయ్యిందని, అర్హులైన వారి జాబితా రూపకాలపనకై క్షేత్రస్థాయిలో మరోమారు సమగ్ర పరిశీలన జరపాలని, వార్డు సభలు, గ్రామ సభల ద్వారా అర్హులైన వారి జాబితా రూపొందించి మండల పరిషత్ అభివృద్ధి అధికారుల లాగిన్ ద్వారా కలెక్టర్ లాగిన్ కు పంపించాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలనకు పంచాయతీ కార్యదర్శులు, మండల వ్యవసాయ విస్తరణాధికారులు, ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులు, రెవెన్యూ సిబ్బందితో కూడిన బృందాలు పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తారని తెలిపారు.
ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, ఆయా సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా పూర్తి పారద్శకత, నిబద్ధతతో క్షేత్రస్ధాయి పరిశీలన ప్రక్రియను నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.