20 లోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జనవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్‌ కార్డులు), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం పరిశీలించారు. ముప్కాల్‌ మండలం నాగంపేట్‌, బాల్కొండ మండలం జలాల్పూర్‌, ఆర్మూర్‌ మండలం ఫత్తేపూర్‌ గ్రామాలలో సర్వే బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్న తీరును తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ కొనసాగుతోందని తెలిపారు. ముఖ్యంగా రైతు భరోసా పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకు లబ్ది చేకూర్చేందుకు వీలుగా సాగుకు యోగ్యమైన భూములను సర్వే నెంబర్ల వారీగా క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా నిర్ధారించడం జరుగుతోందన్నారు. అదేవిధంగా ఆహార భద్రతా కార్డులను అర్హత కలిగిన కుటుంబాలకు అందించేందుకు వీలుగా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికార బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నాయని తెలిపారు.

ఈ నెల 20వ తేదీ నాటికి ఆయా పథకాల కింద అర్హులైన వారి జాబితాలను రూపొందించి, 21 నుండి 24వ తేదీ వరకు ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మండల స్పెషల్‌ ఆఫీసర్ల పర్యవేక్షణలో నిర్వహించనున్న గ్రామ సభలలో వాటిని ప్రవేశపెట్టి చదివి వినిపించడం జరుగుతుందన్నారు. గ్రామ సభ ఆమోదం మేరకు లబ్ధిదారుల వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేస్తామన్నారు.

ఈ నెల 26 వ తేదీన ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్‌ కార్డులు), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలుకు శ్రీకారం చుట్టి లబ్దిదారులకు ప్రయోజనం చేకూర్చనుందని కలెక్టర్‌ తెలిపారు. కలెక్టర్‌ వెంట ఆర్మూర్‌ ఆర్డీఓ రాజాగౌడ్‌, ఆయా మండలాల స్పెషల్‌ ఆఫీసర్లు స్రవంతి, రసూల్‌ బీ, బాల్కొండ ఎంపిడిఓ విజయభాస్కర్‌ రెడ్డి, తహసీల్దార్‌ శ్రీధర్‌ తదితరులు ఉన్నారు.

Check Also

ఆగ్రోస్‌ భూములను కాపాడడమే నా లక్ష్యం…

Print 🖨 PDF 📄 eBook 📱 హైదరాబాద్‌, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »