అర్హులందరికి సంక్షేమ ఫలాలు అందాలి

నిజామాబాద్‌, జనవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

పేద, బడుగు, బలహీనవర్గాలకు బాసటగా నిలువాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరేలా అంకిత భావంతో కృషి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై జిల్లా ఇంచార్జ్‌ మంత్రి జూపల్లి ఆదివారం నిజామాబాద్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలలో పై నాలుగు పథకాలను అమలు చేయడానికి జిల్లా యంత్రాంగాల ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యల గురించి కలెక్టర్లు రాజీవ్‌ గాంధీ హనుమంతు, ఆశిష్‌ సంగ్వాన్‌ లు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధామ్యాలను ఇంచార్జ్‌ మంత్రి జూపల్లి ప్రస్తావిస్తూ, ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అర్హులందరికీ సంక్షేమ పథకాల ద్వారా మేలు చేకూరేలా చూడాలని అధికారులకు హితవు పలికారు.

అర్హత కలిగిన ఏ ఒక్కరు కూడా మినహాయించబడకూడదని, అదే సమయంలో అనర్హులకు లబ్ధిదారుల జాబితాలో చోటు దక్కకుండా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఎలాంటి విమర్శలు, తప్పిదాలకు తావులేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగాలన్నారు. ఎక్కడైనా చిన్నచిన్న లోపాలు, సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటే వాటిని సవరించుకోవాలని సూచించారు.

ఇప్పటికే అమలులో ఉన్న పాత సంక్షేమ పథకాలను యధాతథంగా కొనసాగిస్తామని, ఏ ఒక్క పథకాన్ని కూడా ప్రభుత్వం ఎత్తివేయబోదని మంత్రి స్పష్టం చేశారు. పాత పథకాలకు అదనంగా మరో నాలుగు కొత్త పథకాలను ఈ నెల 26 నుండి అమలు చేయనుందని వెల్లడిరచారు. తమకు సంక్షేమ పథకాలు రాలేదని ఏ ఒక్కరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా ప్రయోజనం చేకూరేలా చూస్తామని, ఎవరికీ అన్యాయం జరగనివ్వబోమని భరోసా కల్పించారు. రేషన్‌ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇల్లు తదితర పథకాలు నిరంతర ప్రక్రియగా అమలు చేస్తామని అన్నారు.

అంతేకాకుండా సాగు భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సైతం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రెండు విడతలలో 12 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అప్పులపై ప్రతీ నెల 6500 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించాల్సి రావడం వల్ల ప్రభుత్వ ఖజానా తీవ్ర ఆర్ధిక సంక్షోభం కూరుకుపోయి ఉన్నప్పటికీ, పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. రెండు లక్షల లోపు పంట రుణాల మాఫీ కింద రైతులకు 21 వేల కోట్ల రూపాయల మాఫీని వర్తింపజేశామని మంత్రి వివరించారు.

ఇంకనూ సాంకేతిక సమస్యలు, చిన్న చిన్న కారణాల వల్ల ఎవరికైనా మాఫీ జరగకపోతే, అలాంటి వారికి కూడా మాఫీ అమలయ్యేలా చూస్తామన్నారు. కాగా, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా అవసరమైతే ఆయా పథకాల నిబంధనలు సడలించాలని ఎమ్మెల్సీ కవితతో పాటు ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను వెల్లడిరచారు.

ఈ సమన్వయ సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, రాష్ట్ర సహకార యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ సభ్యులు గడుగు గంగాధర్‌, ఐడిసిఎంఎస్‌ చైర్మన్‌ తారాచంద్‌, నుడా చైర్మన్‌ కేశ వేణు, నిజామాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్లు వి.విక్టర్‌, శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌ తో పాటు ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

ఆగ్రోస్‌ భూములను కాపాడడమే నా లక్ష్యం…

Print 🖨 PDF 📄 eBook 📱 హైదరాబాద్‌, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »