నిజామాబాద్, జనవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలను రాష్ట్రంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి వర్తింపజేస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు. శనివారం రాత్రి రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
ఆహార భద్రత (రేషన్) కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు నిరంతర ప్రక్రియగా అమలు చేయడం జరుగుతుందని మంత్రులు స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఆయా పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని గుర్తు చేశారు. వాటికి సంబంధించి ప్రతి రెవెన్యూ గ్రామంలో అధికార బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నాయని అన్నారు. ఇంకనూ ఎవరైనా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు తదితర పథకాల కోసం దరఖాస్తు చేసుకోనట్లయితే, అలాంటి వారు కూడా ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
ఈ నెల 21 నుండి 24 వరకు నిర్వహించనున్న గ్రామ సభలలో కూదా అర్జీలు సమర్పించవచ్చని తెలిపారు. ఈ నెల 24 తర్వాత ప్రజాపాలన సేవా కేంద్రాలలోనూ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు అందించవచ్చని సూచించారు. ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా పరిశీలిస్తూ, అర్హత కలిగిన వారందరికీ ప్రభుత్వం ఆయా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తుందని మంత్రులు స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అనుమానాలకు లోను కావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా రేషన్ కార్డులు, ఇతర పథకాల కోసం తెల్ల కాగితాలపై వచ్చిన దరఖాస్తును సైతం పరిశీలించి, అర్హులకు ప్రయోజనం చేకూరుస్తామని వెల్లడిరచారు.
అర్హులైన చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమ పధకాలు వర్తింపజేసే కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతూనే వుంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇటీవల జరిపించిన సామాజిక, ఆర్థిక సర్వేలోనూ రేషన్ కార్డులు అవసరం ఉన్న కుటుంబాలను గుర్తించడం జరిగిందని తెలిపారు. తమకు ఆహార భద్రత కార్డు రాలేదని ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు, ఇతర పథకాలు అందజేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని మంత్రులు వివరించారు.
ఆయా సంక్షేమ పథకాల కింద దరఖాస్తులు చేసుకునే వారి నుండి అర్జీలు స్వీకరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు మంత్రులు, సీ.ఎస్ సూచించారు. ఎలాంటి గందరగోళం, తప్పిదాలకు తావు లేకుండా గ్రామ సభలు సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, డీ ఎస్ ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీ.ఎం రాజేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.