నిజామాబాద్, జనవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, రూపొందించిన వివరాలను కలెక్టర్ తనిఖీ చేశారు. చందూర్, అక్బర్ నగర్, రుద్రూర్ గ్రామాలను కలెక్టర్ సోమవారం సందర్శించారు. స్థానిక అధికారులతో భేటీ అయ్యి, ఆహార భద్రత (రేషన్) కార్డులు, రైతు భరోసా పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా సేకరించిన వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు.
రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్ ద్వారా వారి పేర్లు ఎక్కడైనా రేషన్ కార్డులో ఉన్నాయా లేవా అన్నది నిర్ధారించుకోవాలని సూచించారు. అక్బర్ నగర్ శివారులోని భూములతో పాటు, రుద్రూర్ బస్టాండ్ వెనుక భాగాన 897 నుండి 957 వరకు గల సర్వే నెంబర్లలోని భూములకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎలాంటి పంటలు సాగు చేయకుండా వ్యవసాయేతర అవసరాలకు భూములను వినియోగిస్తుండడాన్ని, లే అవుట్ చేసి ప్లాట్లుగా మార్చడాన్ని గమనించిన కలెక్టర్, అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వ్యవసాయ యోగ్యంలో లేని భూములను పక్కాగా గుర్తించాలని, క్రాప్ బుకింగ్, భువన్ యాప్‌ల సహాయంతో వెరిఫికేషన్ చేయాలన్నారు. అధికారులు సేకరించిన క్షేత్రస్థాయి వివరాలతో కూడిన రిజిస్టర్లను తనిఖీ చేసి, గ్రామ సభల నిర్వహణపై సూచనలు చేశారు. ఎలాంటి తప్పిదాలు, గందరగోళానికి తావు లేకుండా పకడ్బందీగా గ్రామ సభలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, చందూర్ ఎంపీడీఓ నీలావతి, తహసీల్దార్ శాంతా, ఇతర అధికారులు ఉన్నారు.