కామారెడ్డి, జనవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఈ నెల 21 నుండి 24 వరకు రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు), ఇందిరమ్మ ఇండ్ల జాబితాలపై జరిగే గ్రామ, వార్డు సభలకు సంబంధించి విస్తృత ప్రచారం చేయాలని, గ్రామ సభల ఆమోదం పొందాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం ప్రజావాణి అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా, మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 535 గ్రామసభలు, 80 మున్సిపల్ వార్డు సభలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించి రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సంబంధించిన ముసాయిదా జాబితాలను ఆయా సభల్లో వివరించి ఆమోదం తీసుకోవాలని తెలిపారు.
పథకాలకు సంబంధించిన అంశాలపై అధికారులకు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. గ్రామ, వార్డు సమావేశాల్లో అభ్యంతరాలు, ఆక్షేపణలు, చేర్పులపై వచ్చిన వాటిపై చర్చించాలని సూచించారు. ప్రతీ పథకానికి సంబంధించి ఒక రిజిస్టర్ ఏర్పాటుచేసి నమోదు చేయాలని అన్నారు. గ్రామ, వార్డు సమావేశాల్లో కొత్తగా వచ్చిన దరఖాస్తు లను స్వీకరించి ఆ తదుపరి విచారణ చేయడం జరుగుతుందని దరఖాస్తు దారులకు తెలియజేయాలని తెలిపారు.
రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించడం నిరంతర ప్రక్రియ అని వివరంగా తెలియజేయాలని అన్నారు. పై నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలను ఆయా మండల అధికారులకు పంపడం జరిగిందని, వాటిని డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపారు. రెవిన్యూ, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, ఆంగన్ వాడీలను నియమించుకొని సహాయకులుగా విధులు అప్పగించాలని తెలిపారు. గ్రామ సభల అనంతరం రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలను ప్రకటించాలని తెలిపారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథ్ రావు, జడ్పీ సీఈవో చందర్ నాయక్, అధికారులు పాల్గొన్నారు.