బాన్సువాడ, జనవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అర్హులైన వారందరికీ ప్రజాపాలన కార్యక్రమం క్రింద లబ్దిచేకూర్చడం జరుగుతుందని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. బుధవారం బాన్సువాడ మున్సిపల్ వార్డ్ నెం. 8,9,10,11 లలో జరిగిన వార్డు సభల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను వార్డు, గ్రామ సభల్లో చదివి వినిపించడం జరుగుతుందని, అట్టి జాబితాలో పేర్లు లేనటువంటి వారు, కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు వార్డు, గ్రామ సభల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ లలో సమర్పించవచ్చు అని తెలిపారు.
అంతేకాకుండా ప్రస్తుతం దరఖాస్తు సమర్పించనీ వారు ఆ తదుపరి మున్సిపల్ కార్యాలయంలో గానీ, ఎంపీడీఓ కార్యాలయంలో గాని సమర్పించవచ్చు అని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. వార్డు, గ్రామ సభల్లో చదివిన జాబితాల్లో అనర్హులు ఉంటే తెలియజేయాలని, అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే పూర్తి వివరాలు తెలియజేయాలని తెలిపారు.
అనంతరం నసురుల్లాబాద్, బిర్కూర్ మండలం తిమ్మాపూర్ లలో జరిగిన గ్రామ సభలలో సబ్ కలెక్టర్ పాల్గొని, గ్రామ సభల్లో నిర్వహిస్తున్న వాటిని పర్యవేక్షిస్తున్నారు. గ్రామస్తులు, పట్టణ వాసులు తెలిపిన అభ్యంతరాలను అధికారులకు తెలియపరుస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆయా సభల్లో మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయం, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖల సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.