కామారెడ్డి, జనవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు కోసం గత ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోని వారు ఈ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడ గ్రామంలో ఏర్పాటుచేసిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఇట్టి పథకాలలో అర్హత కలిగిన వారి పేర్లు రానివారు దరఖాస్తులు ఆయా కౌంటర్‌లలో సమర్పించవచ్చని తెలిపారు.
దరఖాస్తులు తీసుకోవడం నిరంతర ప్రక్రియ అని తెలిపారు. గ్రామ సభల్లోనే కాకుండా ఎంపీడీఓ కార్యాలయంలోని ప్రజాపాలన కౌంటర్ లో కూడా దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. ఇపుడు సమర్పిస్తున్న దరఖాస్తుల పై పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
గ్రామ సభల్లో చదివిన జాబితాలపై అభ్యంతరాలు, ఆక్షేపణలు, చేర్పులు ఉంటే పూర్తివివరాలు గ్రామ సభలో తెలియజేయవచ్చని తెలిపారు. అనంతరం వివిధ పథకాల కోసం ఏర్పాటుచేసిన కౌంటర్ లను కలెక్టర్ పరిశీలించారు. గ్రామ సభలో మండల ప్రత్యేక అధికారి రాజారాం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సయ్యద్ సాజిద్ అలీ, పంచాయతీ కార్యదర్శి రేణుక, వ్యవసాయ అధికారి నర్సింలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.