నిర్దేశిత ప్రణాళికకు అనుగుణంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించాలి

నిజామాబాద్‌, జనవరి 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నిర్దేశిత ప్రణాళికకు అనుగుణంగా ప్రజాపాలన గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఈ నెల 24 వరకు కొనసాగనున్న గ్రామ సభల నిర్వహణపై మంగళవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, సీతక్కలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతి కుమారితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 26న అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలు (రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు) పథకాలకు ఇప్పటివరకు దరఖాస్తులు చేసుకోని వారి నుండి గ్రామ సభలలో అర్జీలు స్వీకరించాలని సూచించారు. గ్రామ సభల అనంతరం ప్రజాపాలన సేవా కేంద్రాల్లోనూ దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్నారు.

ముఖ్యంగా రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు సంబంధించి అర్హత కలిగిన చిట్టచివరి కుటుంబానికి సైతం లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావులేదన్నారు. రాష్ట్రంలో ఎంతమంది అర్హులు ఉంటే, అంత మందికి రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

వీ.సీ అనంతరం కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలును జనవరి 26న ప్రారంభించనున్న నేపథ్యంలో 24 వరకు నిర్వహించే గ్రామ సభలను షెడ్యుల్‌ వారీగా ఖచ్చితంగా సమయపాలన పాటిస్తూ నిర్వహించాలని, ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులందరూ అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఆదేశించారు.

మొదటి రోజైన మంగళవారం జిల్లాలో 201 గ్రామాలు, వార్డులలో జరిగాయని, ఇదే తరహాలో అన్ని గ్రామాలు, వార్డులలో ప్రణాళికాబద్ధంగా సభలు నిర్వహించాలని సూచించారు. ఆయా పథకాల కింద ఇప్పటివరకు దరఖాస్తులు చేసుకోని వారి నుండి గ్రామ సభలలో అర్జీలు స్వీకరించాలని, వాటిని తప్పనిసరిగా పరిశీలించి అర్హులైన వారికి లబ్ధి చేకూర్చడం జరుగుతుందని స్పష్టంగా తెలియజేయాలన్నారు.

లబ్దిదారుల జాబితాను గ్రామ సభల్లో చదివి వినిపించాలని, ఎవరికైనా అభ్యంతరాలుంటే వారి నుండి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ఎలాంటి అపోహలు తలెత్తకుండా ప్రజలకు స్పష్టంగా ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని వివరించాలని, సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు. గ్రామ సభలలో ఆయా పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించే సమయంలో కుటుంబ యజమాని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్‌ నెంబర్లు, మొబైల్‌ నెంబర్‌, చిరునామా వివరాలు తప్పనిసరి ఉండేలా చూసుకోవాలన్నారు.

దీనివల్ల డేటా ఎంట్రీ సమయంలో ఇబ్బందులకు ఆస్కారం ఉండదని కలెక్టర్‌ సూచించారు. ఇందిరమ్మ ఇళ్ళ కోసం వచ్చిన దరఖాస్తులను, ప్రత్యేకించి అద్దె ఇంట్లో ఉన్నామని దరఖాస్తులు చేసుకున్న వారి అర్జీలను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. గ్రామసభలు నిర్వహించే తప్పనిసరిగా తగిన నీడ తాగునీటి వసతి వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్‌ లో అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ అంకిత్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 బుధవారం, జనవరి.22, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – హేమంత ఋతువుపుష్య …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »