గాంధారి, జనవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అర్హత కలిగిన పేద కుటుంబాలకు లబ్ధి చేకూరే విధంగా పథకాలు మంజూరు చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ తెలిపారు. శుక్రవారం గాంధారి మండలం ఖర్కవాడి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో గ్రామ సభ ఆమోదం మేరకు అర్హత కలిగిన వారికి లబ్ధి చేకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఇంతకు క్రితం ప్రజాపాలన లో దరఖాస్తు చేసుకోనీ వారు ఇపుడు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
గతంలో దరఖాస్తు చేసుకున్న జాబితాలను గ్రామ సభలో చదివి వినిపించడం జరుగుతుందని, అట్టి జాబితాలో అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే తెలియజేయాలని అన్నారు. దరఖాస్తులు స్వీకరించడం నిరంతర ప్రక్రియ అని తెలిపారు. గ్రామ సభలో తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.