కామరెడ్డి, జనవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జనవరి 26 గణతంత్ర దినోత్సవ నుంచి 4 నూతన పథకాల అమలు ప్రారంభం చేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శనివారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి నూతన పథకాల ప్రారంభ ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా నూతన పథకాల ప్రారంభ ఏర్పాట్ల మాట్లాడుతూ, గ్రామ, వార్డు సభలను సమర్థవంతంగా నిర్వహించినందుకు అధికారులకు ముందుగా అభినందనలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల, నూతన రేషన్ కార్డుల జారీ పథకాలను లాంఛనంగా ప్రతి మండలంలో ఒక గ్రామంలో ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
ప్రతి మండలంలో 250 నుంచి 400 వరకు ఇండ్లు ఉన్న గ్రామాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఈ గ్రామాలను ఎంపిక చేయాలని అన్నారు. ప్రజా పాలన ప్రారంభించే గ్రామాల జాబితా, గ్రామాలలో 4 పథకాల లబ్ధిదారుల వివరాలను నిర్ణిత నమునాలలో పంపాలని కలెక్టర్లకు సిఎస్ తెలిపారు.
జనవరి 26న ఎంపిక చేసిన గ్రామాలలో మధ్యాహ్నం ఒంటి గంటకు 4 పథకాలను అధికారికంగా ప్రారంభించాలని అన్నారు. మండల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగాలని, 4 పథకాలకు సంబంధించి సదురు గ్రామాల్లో అర్హులైన వారందరికీ లబ్ధి చేకూరేలా చూడాలని అన్నారు.
4 నూతన పథకాల లాంచింగ్లో అర్హులు మాత్రమే జాబితాలో ఉండేలా అప్రమత్తంగా ఉండాలని, గ్రామ సభలలో స్వీకరించిన నూతన దరఖాస్తులను సైతం పరిశీలించి అర్హులు ఉంటే రేపటి జాబితాలో యాడ్ చేయాలని అన్నారు.
నూతన రేషన్ కార్డుల జారీ ను తహసిల్దార్ బృందం, ఇందిరమ్మ ఇండ్ల జాబితాను ఎంపీడీవో బృందం, రైతు భరోసా జాబితా ను మండల వ్యవసాయ అధికారి బృందం, ఇందిరమ్మ రైతు భరోసా జాబితాను ఏపిఓ నరేగా బృందం పరిశీలించి, ఆ జాబితాలో అర్హులు మాత్రమే ఉండేలా పథకాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు.
నూతన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరగాలని, 4 పథకాలకు సంబంధించి లబ్దిదారులు ప్రారంభ కార్యక్రమానికి వచ్చేలా చూడాలని, లబ్ధిదారుల వివరాలను గ్రామాలలో ప్రదర్శించాలని తెలిపారు. ప్రారంభ కార్యక్రమానికి ప్రతి గ్రామంలో మంచి ఆడియో వీడియో ఏర్పాట్లు చేయాలని, ముందస్తుగా ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రతి గ్రామంలో ప్రదర్శించాలని సీఎస్ అన్నారు.
4 పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రజలకు మరో సారి వివరించాలని, ఎంపిక కాబడిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు జారీ చేయాలని, అనంతరం ప్రజా ప్రతినిధులు తమ సందేశాలు అందించాలని, లాంచ్ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ అడ్వైజర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను ఆహ్వానించాలని సీఎస్ పేర్కొన్నారు.
4 పథకాల లాంచింగ్ కోసం ఎంపిక చేసిన గ్రామాలలో నిర్వహించిన గ్రామసభలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు పంపి, నేడు క్షేత్రస్థాయి విచారణ చేయాలని , ఆ దరఖాస్తులలో అర్హులు ఉంటే పేర్లు నమోదు చేసి రేపటి లాంచింగ్ కార్యక్రమంలో పథకాలను సంబంధిత లబ్ధిదారులకు వర్తింపజేయాలని అన్నారు. ప్రతి మండలంలో 4 పథకాల లాంచింగ్ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, ఎక్కడ ఎటువంటి గందరగోళం జరిగేందుకు వీలు లేదని, ప్రభుత్వ పథకాలు అర్హులైన చివరి లబ్ధిదారుడు వరకు చేరుతాయనే విశ్వాసాన్ని ప్రజలలో కల్పించాలని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, జిల్లాలో 535 గ్రామ సభలు, 80 వార్డు సభలు నిరచించడం జరిగిందని, రేషన్ కార్డుల.కొరకు 54,534, ఇందిరమ్మ ఇండ్ల కొరకు 28,653, రైతు భరోసా కోసం 2,653, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం 18,098 దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసిబ్లాబ్ధిదారుల జాబితాలు సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ వి.విక్టర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, జడ్పీ సీఈవో చందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.