ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాది

నిజామాబాద్‌, జనవరి 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాదిగా నిలుస్తోందని, దీనిని గుర్తెరిగి ప్రతి ఒక్కరు ఎంతో విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు, ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. 15వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్‌ అధ్యక్షత వహించగా, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్‌ మీనా ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, ఆయా పార్టీల వారు ప్రచార అనుమతుల కోసం ఆన్‌ లైన్లో దరఖాస్తులు చేసుకునేలా అనుమతుల ప్రక్రియను సులభతరం చేసిందన్నారు. ఎక్కడైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలను గమనిస్తే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా సి-విజిల్‌ వంటి యాప్‌ లను కూడా ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందని అన్నారు. మన దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతున్న ఓటింగ్‌ వ్యవస్థ వల్ల అధికార మార్పిడి ప్రక్రియ సాఫీగా జరుగుతోందని, ఇది దేశాభివృద్ధికి కూడా దోహదపడుతోందని కలెక్టర్‌ గుర్తు చేశారు. ఎంతో కీలకమైన ఎన్నికల ప్రక్రియ నిరాటంకంగా జరిగేందుకు అధికారులతో పాటు స్వచ్చంద సంస్థలు, ఎన్‌.సీ.సీ క్యాడెట్లు తదితరులు సైతం తమవంతు సహకారం అందిస్తున్నారని అన్నారు.

ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఇదివరకు ఏడాదికి ఒక పర్యాయం చేపట్టేదని, ప్రస్తుతం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని చేపడుతోందని తెలిపారు. 17 సంవత్సరాల వారు కూడా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే, వారికి 18 సంవత్సరాలు నిండిన వెంటనే ఓటరు జాబితాలో పేరు నమోదు చేయడం జరుగుతుందని సూచించారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక క్యూ లైన్‌ ఏర్పాటు చేయాల్సిందిగా పలువురి నుండి వచ్చిన అభ్యర్థనలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటూ ఈ.సీ.ఐకు ప్రతిపాదిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

ప్రజలు ఎవరైనా సరే కలెక్టరేట్‌ తో పాటు సహాయ రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాలను సంప్రదించి ఎన్నికలతో ముడిపడిన అంశాలపై తమ సలహాలు, సూచనలను అందించవచ్చని తెలిపారు. ముఖ్య అతిథి వికాస్‌ మీనా, అదనపు కలెక్టర్‌ అంకిత్‌ లు మాట్లాడుతూ, స్వేచ్చాయుత వాతావరణంలో మనకు నచ్చిన నాయకులను ఓటు ద్వారా ఎన్నుకునే అవకాశం కేవలం ఓటు హక్కు ద్వారానే సాధ్యమని, నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనే భావన ఎంతమాత్రం సరికాదని, ప్రజాస్వామ్య పరిరక్షణలో, మంచి పాలకులను ఎన్నుకోవడంలో ప్రతి ఓటూ ఎంతో కీలకమైనదని సూచించారు. అప్పుడే ప్రజాస్వామ్యం మరింతగా పరిఢవిల్లుతుందని సూచించారు.

ఎన్నికలలో ఎలాంటి ప్రలోభాలకు ప్రభావితం కాకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్న 80 ఏళ్ళు పైబడిన సీనియర్‌ సిటిజన్లు నాగుల సాయమ్మ, కొట్టూర్‌ ఇందిరా, అవధూత భూమయ్య, మెరుగు ఒడ్డెమ్మ, అంకం సుశీల, వై.నర్సయ్యలను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా కొత్తగా నమోదైన యువ ఓటర్లు నబీలా నూరిన్‌, లోకేష్‌ గౌడ్‌ అంబటి, షేక్‌ సుమేర్‌, సయ్యద్‌ అబ్దుల్‌ రెహమాన్‌, అబ్దుల్‌ ఇర్ఫాన్‌, రాచర్ల భవన్‌ కుమార్‌ లకు కొత్త ఓటరు ఐ.డీలను అందించి సత్కరించారు.

జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పోటీలలో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ సంకేత్‌ కుమార్‌, నిజామాబాద్‌ ఆర్డీఓ రాజేంద్రకుమార్‌, జిల్లా స్వీప్‌ అధికారి సురేష్‌ కుమార్‌, కలెక్టరేట్‌ ఏ.ఓ ప్రశాంత్‌, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్‌, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, విద్యార్థిని విద్యార్థులు, ఎన్‌.సీ.సీ క్యాడెట్లు, పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, జనవరి.27, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం -హేమంత ఋతువుపుష్య మాసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »