నిజామాబాద్, జనవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం నుండి శ్రీకారం చుట్టడం జరుగుతోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు .ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు.
రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ప్రతిష్టాత్మక నాలుగు సంక్షేమ పథకాల అమలు కోసం చేపట్టాల్సిన చర్యల గురించి తెలియజేశారు. అనంతరం కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాల అమలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రతి మండలంలో ప్రజాప్రతినిధులను సంప్రదించి వారి సూచన మేరకు ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసుకోవాలన్నారు.

ఎంపిక చేసిన ప్రతీ గ్రామంలోనూ పథకాల ప్రారంభోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఎలాంటి తప్పిదాలు, గందరగోళానికి తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేదిక, షామియానా, తాగునీరు వంటి సదుపాయాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లను చేయాలన్నారు. ప్రజాప్రతినిధులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని, మధ్యాహ్నం ఒంటి గంటకు సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టాలన్నారు.
ఎంపిక చేసిన గ్రామంలోనే నాలుగు పథకాల అమలును ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. ముందుగా ముఖ్యమంత్రి సందేశంతో కూడిన వీడియోను ప్రదర్శించాలన్నారు. ఒక్కో పథకానికి గాను ప్రత్యేకంగా ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆహార భద్రత కార్డులకు తహసీల్దార్ నేతృత్వంలో, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపీడీఓ ఆధ్వర్యంలో, రైతు భరోసాకు మండల వ్యవసాయ అధికారి నేతృత్వంలో, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి గాను ఏ.పీ.ఓ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను నియమించాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారులు ఓవరాల్ ఇంచార్జీలుగా వ్యవహరిస్తూ నాలుగు సంక్షేమ పథకాల అమలు ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతం అయ్యేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
గ్రామాలకు వెళ్ళడానికి ముందే ఆయా పథకాలకు సంబంధించిన లబ్దిదారుల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జాబితాలో నూటికి నూరు శాతం అర్హులు మాత్రమే ఉండేలా సరి చూసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనర్హులు ఉండకూడదని అన్నారు. ప్రజాపాలన గ్రామ సభల సంధర్భంగా వచ్చిన దరఖాస్తులను సైతం పరిశీలించి, ఆయా పథకాల కింద అర్హుల పేర్లను జాబితాలో చేర్చాలని, పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలోనే వారికి కూడా పథకాల మంజూరీకి సంబంధించిన ప్రొసీడిరగ్స్ అందించాలని కలెక్టర్ సూచించారు.
గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా తప్పనిసరి లబ్ది చేకూరేలా చొరవ చూపాలని అన్నారు. అదే సమయంలో అనర్హులకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎలాంటి విమర్శలు, ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా చూడాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.