కామారెడ్డి, జనవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఓటు హక్కు విలువను కాపాడాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ ఓటరు దినోత్సవం 2025 ను భారత ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని ఓటుహక్కు విలువను కాపాడాలని అన్నారు.
నిజాయితీ పరులకు ఓటు వేయడం ద్వారా సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. పట్టణాల్లో పోలింగ్ శాతం తక్కువ గాను, పల్లెల్లో పోలింగ్ శాతం ఎక్కువగా జరుగుతుందని అన్నారు. చదువుకున్న అర్హత కలిగిన వారు బాధ్యతగా ఓటు వేయడం బాధ్యతగా గుర్తించాలని అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అందరికీ సమానులే అని వివరించారు.
దేశంలో 2024 లో జరిగిన ఎన్నికల్లో 99 కోట్ల మంది ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోగా 66 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. 1950 సంవత్సరంలో భారత సంఘం ఏర్పాటు అయ్యిందని, 2020 నుండి జాతీయ ఓటరు దినోత్సవాలను జరుపుకుంటున్నామని తెలిపారు. అనంతరం సమావేశానికి హాజరైన వారందరిచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమానికి ముందు భారత ఎన్నికల కమీషనర్ సందేశాన్ని వినిపించారు. అనంతరం వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరచిన వారికి సర్టిఫికెట్, మెమెంటో లు అందజేశారు. వయో వృద్ధురాలు, యంగ్ ఓటర్లను, థర్డ్ జెండర్ లను శాలువాలతో సత్కరించారు.
విద్యార్థులచే మానవహారం , ప్రతిజ్ఞ చేయించిన అదనపు కలెక్టర్ వి.విక్టర్
జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని నిజాం సాగర్ చౌరస్తా లో మానవ హారం ఏర్పడి, ప్రతిజ్ఞ లను అదనపు కలెక్టర్ ( రెవిన్యూ) వి.విక్టర్ చేయించారు.
కార్యక్రమాల్లో ఆర్డీఓ రంగనాథ్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్.భీమ్ కుమార్, తహసీల్దార్ జనార్ధన్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, కలెక్టరేట్ పరిపాలన అధికారి మసూద్ అహ్మద్, టీఎన్జిఒ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, టీజిఒ అధ్యక్షులు దేవేందర్, కార్యదర్శి సాయిరెడ్డి, రెవిన్యూ సిబ్బంది, విద్యార్థులు, పాఠశాలల ఉపాద్యాయులు, తదితరులు పాల్గొన్నారు.