కామారెడ్డి, జనవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. రైతు భరోసా, ఆత్మీయ రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల ప్రారంభోత్సవం (లాంచింగ్) సందర్భంగా ఆదివారం మాచారెడ్డి మండలం రాజ్ ఖాన్ పేట్ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
తొలుత కార్యక్రమానికి ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పథకాలను ఈ రోజు ప్రారంభిస్తున్నదని (లాంచింగ్) , అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడిరగ్ పత్రాలను అందజేస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులకు ఈ సందర్భంగా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
రాజ్ ఖాన్ పేట్ గ్రామంలో 56 మందికి ఇందిరమ్మ ఇండ్లు, 27 మందికి రేషన్ కార్డులు, 85 మందికి రైతు భరోసా, 29 మందికి ఆత్మీయ రైతు భరోసా పథకాల మంజూరు ఉత్తర్వులు లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథ్ రావు, మండల ప్రత్యేక అధికారి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, గృహ నిర్మాణ శాఖ పి.డి. విజయపాల్ రెడ్డి, ఎంపీడీఓ నాగరాజు, తహసీల్దార్ శ్వేత, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు.