మోర్తాడ్, జనవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు లాంఛనంగా ప్రారంభించారు. ఆయా పథకాల కింద అర్హులైన లబ్దిదారులకు మంజూరీ పత్రాలు అందజేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సందేశంతో కూడిన వీడియో క్లిప్ ను ప్రదర్శించారు. సంక్షేమ పథకాల అమలు తీరును, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్దిదారులను ఎంపిక చేసిన విధానం గురించి అధికారులు తెలిపారు.
ఈ సంద్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవ వేడుకల రోజున సంక్షేమ పథకాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నదే ప్రభుత్వ అభిమతం అని, నిరంతర ప్రక్రియగా ఇది కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 31 రెవెన్యూ మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగిందన్నారు.
అర్హత కలిగిన వారు ఏ ఒక్కరూ మినహాయించబడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రజా పాలన గ్రామ సభలలో వచ్చిన దరఖాస్తులను సైతం పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేశామని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా లబ్ధిదారుల జాబితాలో అనర్హులకు చోటు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని అన్నారు. క్షేత్రస్ధాయి పరిశీలన జరిపి అర్హులను గుర్తించిన మీదట ప్రజా పాలన గ్రామ సభలలో పేర్లు చదివి వినిపించి, గ్రామ సభ ఆమోదంతో లబ్ధిదారుల తుది జాబితా రూపొందించామని వివరించారు.
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద మంజూరీలు పొందిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో రేపటి నుండి రూ. 6 వేలు చొప్పున నగదు జమ కానుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్దిదారులకు ఇంటి నిర్మాణ దశలను అనుసరిస్తూ ప్రభుత్వం నాలుగు విడతలలో ఆన్ లైన్ విధానం ద్వారా రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని ఇతరులకు స్ఫూర్తిగా నిలువాలని కలెక్టర్ హితవు పలికారు.
ఆహార భద్రత (రేషన్) కార్డులను అర్హులైన వారికి కొత్తవి మంజూరు చేయడంతో పాటు కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం సైతం జరుగుతుందన్నారు. కాగా, ఆయా పథకాల కింద మంజూరీ పత్రాలు పొందిన లబ్ధిదారులు హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. ముఖ్య అతిథిగా విచ్చేసి సంక్షేమ పధకాలను లాంఛనంగా ప్రారంభించిన కలెక్టర్ ను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీడీఓ తిరుమల, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీఓ శ్రీధర్, ఏపీఓ ప్రమీల, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.